అమెరికా, జర్మనీ, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, న్యూజిలాండ్ దేశాల రాయబారులను టర్కీ బహిష్కరించింది. జైలులో ఉన్న సామాజిక కార్యకర్తను విడుదల చేయాలన్నందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విదేశాంగ శాఖను టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ ఆదేశించారు.
పౌర హక్కుల కార్యకర్త అయిన ఉస్మాన్ కవాలాను 2013లో దేశవ్యాప్త అల్లర్లు, ఆందోళనలకు కారకుడయ్యాడని, 2016లో మళ్లీ అలాంటి ఆందోళనలకు ప్రయత్నించారన్న కారణంతో ఎర్డోగాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. నాలుగేళ్లుగా ఆయన జైలులోనే ఉంటున్నారు. కవాలాను త్వరగా విడుదల చేయాలని, కేసును త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న పది దేశాల రాయబారులు సంయుక్త ప్రకటన చేశారు.
దీనిపై అసహనం వ్యక్తం చేసిన టర్కీ విదేశాంగ శాఖ.. ఆయా దేశాల రాయబారులకు సమన్లు ఇచ్చింది. వారెవరూ అవసరం లేదని, వారిని దేశం నుంచి పంపించేయాలని విదేశాంగ శాఖను ఆదేశించినట్టు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటించారు. అప్పుడే వారంతా టర్కీ అంటే ఏంటో తెలుసుకుంటారని, అర్థం చేసుకోలేని వారు తమ దేశంలో ఉండడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో సమావేశమవుదామనుకున్నానని, కానీ, ఇప్పుడు మనసు మార్చుకున్నానని ఆయన స్పష్టం చేశారు.