Monday, November 18, 2024

రైలు ప్ర‌మాదంపై ప్ర‌పంచ దేశాలు దిగ్ర్భాంతి – సంతాపాన్ని తెలిపిన వివిధ దేశాధినేత‌లు

న్యూఢిల్లీ – ఒడిశాలో జ‌రిగిన ఘోర రైలు ప్రమాదం పై అంతర్జాతీయ స‌మాజం దిగ్ర్భాంతి వ్య‌క్తం చేసింది.. రష్యా అధ్యక్షుడు పుతిన్ , జపాన్‌ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా , ఉక్రైయిన్ అధ్య‌క్షుడు జెలెన్క్సీ, ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు కోరోసితో పాటు వివిధ దేశాధినేతలు , ప్రముఖులు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ స‌మ‌యంలో భార‌త్ కు అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు.

రైలు ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను మేం పంచుకుంటామ‌ని పేర్కొన్నారు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ఆశిస్తున్నాన్నారు..ఈ స‌మ‌యంలో భార‌త్ కు అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని తెలిపారు.
ఒడిశా విషాద ఘటన దిగ్ర్భాంతికరం. ఉక్రెయిన్ ప్రజల తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోపాటు బాధితుల కుటుంబీకులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ . గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆయ‌న ఆకాంక్షించారు.


ఒడిశాలో జరిగిన రైలు దుర్ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమ‌ని అన్నారు జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా. జపాన్ ప్రభుత్వం, ప్రజల తరఫున సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఒక లేఖ విడుద‌ల చేశారు…
ఒడిశాలో రైలు ప్రమాదం విషాదకరమ‌ని, మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాన‌ని అన్నారు ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు కోరోసి .
భారత్‌లో జరిగిన రైలు ప్రమాద దృశ్యాలు కలవరపర్చాయ‌ని అన్నారు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో. తమ ప్రియమైనవారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాన‌న్నారు… ఈ క్లిష్ట సమయంలో కెనడియన్లు అంద‌రూ భారత ప్రజలకు అండగా ఉన్నార‌ని పేర్కొన్నారు..
రైలు ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం బాధ కలిగించింద‌ని నేపాల్ ప్ర‌ధాని పుష్పకమల్‌ దహల్ . ఈ దుఃఖ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నాన‌ని అన్నారు
భారత్‌లో జరిగిన రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమ‌న్నారు పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్. ఈ ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాన‌ని. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని తెలిపారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ లెయన్‌. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అన్నారు.. ఈ ఘటనపై ఐరోపా స‌మాజం సంతాపం వ్యక్తం చేస్తోంద‌న్నారు.
రైలు దుర్ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరి కోసం తైవాన్ ప్రార్థిస్తోందని తైవాన్‌ అధ్యక్షురాలు సాయ్‌ ఇంగ్‌-వెన్ తెలిపారు . బాధితులకు, వారి కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నానంటూ ప్ర‌ధాని మోడికి సందేశం పంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement