మూడవ త్రైమాసిక ఫలితాల క్యాలెండర్ దాదాపుగా ముగియడం, సమీపంలో కీలక పరిణామాలు లేనందున ఈవారం ఈక్విటీ పెట్టుబడిదారులు ప్రపంచ పరిస్థితులు, విదేశీ ఫండ్ కదలికలపై దృష్టి సారిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వారంలో ఫిబ్రవరి డెరివేటివ్‌ల గడువు ముగియనున్నందున మార్కెట్లు అస్థిరంగా ఉంచ్చొని అంచనా వేస్తున్నారు. ”గ్లోబల్ క్యూస్, డెరివేటివ్ ముగింపు గడువు ఈ వారం అస్థిరతకు కారణం కావచ్చు. గత కొన్ని రోజులుగా ఎఫ్‌పీఐలు కొనుగోళ్లపై కొంత ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ వారం కూడా ఇది ముందుకు కొనసాగవచ్చు అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అన్నారు. ఎఫ్‌పీఐలు గతవారంలో (ఫిబ్రవరి 7-12 వరకు) రూ. 3,920 కోట్ల నికర అమ్మకాలకు వ్యతిరేకంగా రూ.7,600 కోట్ల కొనుగోళ్లు జరిపారు.
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కదలిక , రూపాయి ట్రెండ్ కూడా ఈ వారం కీలకంగా మారనుంది. గత వారం బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ 319.87 పాయింట్లు లేదా 0.52 శాతం పెరిగింది. కీలక స్థూల ఆర్థిక సంఖ్యల విడుదల, నిరంతర ఎఫ్‌ఐఐ కొనుగోళ్లతో ఆధిపత్యం చెలాయించడంతో దేశీయ మార్కెట్లు గత వారంలో సానుకూల ధోరణిని కనబరిచాయి. అయితే, ఊహించిన దానికంటే ఎక్కువ ద్రవ్యోల్బణం, యుఎస్ మార్కెట్లో బలమైన జాబ్ మార్కెట్ అననుకూల కలయిక వారం చివరిలో మార్కెట్లను దిగువకు లాగింది. ఇది కఠినమైన ద్రవ్య విధానం గురించి ఆందోళనలను పెంచుతుంది అని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.
ఫారెక్స్ నిల్వల్లో 8.3శాతం క్షీణత…
ఫిబ్రవరి 10 నుంచి 17తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 8.3 శాతం పడిపోయాయి. ఇది 11నెలల కాలంలో గరిష్ట క్షీణత. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం, గతవారం చివరి నాటికి ఫారెక్స్ నిల్వలు నెలరోజుల కనిష్టస్థాయి 566.95 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకు ముందు వారంలో ఇవి 575.27 బిలియన్ డాలర్లుగా ఉండేవి. ఈ సమయంలో అది 1.5 శాతం పడింది. డాలర్‌తో రూపీ మార్పిడి రేటు అస్థిరతను నిర్ధారించడానికి రిజర్వు బ్యాంకు ఫార్వర్డ్ మార్కెట్‌లో జోక్యం చేసుకుంటుంది. ఫారెక్స్ రిజర్వులలో మార్పులు కూడా వ్యాల్యుయేషన్ లాభాలు, నష్టాల నుంచి ఉత్పన్నమవుతాయని ఆర్‌బీఐ గతంలో పేర్కొంది. గతవారం రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 0.8శాతం పడిపోయింది. గత రెండు నెలల్లో ఇది అతిపెద్ద క్షీణ. 82.34 నుంచి 82.79 మధ్య ట్రేడవుతూ వచ్చింది. చివరకు 82.83వద్ద ముగిసింది.