అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించడానికి, విశాఖ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం భారీ ప్రణాళికను రచిస్తోంది. మార్చి మాసంలో 3,4 తేదీలో నిర్వహించనున్న అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సును విజయవంతం చేసి రాష్ట్రానికి భారీ స్తాయిలో పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది . ఈ సదస్సును వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోంటోంది. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్‌తో కలిసి ఈ సదస్సును నిర్వహిస్తోంది. దేశ, విదేశాల నుండి పెద్ద పెద్ద ప్రముఖులను, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన బడా పెట్టుబడి దారులను విశాఖ రప్పించేందుకు ఇప్పటి నుండే ప్రయత్నాలు ప్రారంభించింది. ఐటి, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యాటక రంగంల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టేందుకు ఈ సదస్సును ఉపయోగించుకోంటోంది. ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, సముద్రరవాణా, వాణిజ్య రంగాల్లో పెట్టుబుడల ఆకర్షణకు ప్రత్యేక ప్రణాళిక రచిస్తోంది.
ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఆపాచీ, కియా, బ్రాండిక్స్‌తోపాటు మరిన్ని పేరు మోసిన, అంతర్జాతీయ కంపెనీలను రాష్ట్రానికి రప్పించేందుకు ప్లాన్ చేసింది. ఈ అంతర్జాతీయ సదస్సుకు హేమాహేమీలను రప్పించాలని, తద్వారా పెట్టుబడులను ఆకర్షించడమే కాక విశాఖ నగరానికి అంతర్జాతీయ ప్రతిష్టను తీసుకురావాలని భావిస్తోంది. ఆపిల్ కంపెనీ చీఫ్ టిమ్‌కుక్, ప్రముఖ ఎలక్ట్రానిక్ కార్ల సంస్థ టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్, అమోజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీరితోపాటు భారతీయ సంతతికి చెందిన గూగుల్ సిఇవో సుందర్ పిచ్చయ్, మైక్రాసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సత్య నాదెళ్ల కూడా రాబోతున్నారు. వీరితోపాటు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అధినేత జీన్ హ్యూన్ క్వాన్‌కు కూడా ఆహ్వానం పంపారు. ఇక దేశంలో ఉన్న ముఖేష్ అంబానీ, అదానీ, ఇతర బడా పెట్టుబడిదారులు కూడా ఈ సదస్సుకు రానున్నారు.
కేంద్ర మంత్రులు, రాయబారులు..
వీరితోపాటు దేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం పంపుతున్నారు. దాదాపు 15 మంద సిఎంలకు ఆహ్వానం పంపిస్తున్నట్లు తెలిసింది. వీరే కాకుండా చాలా మంద కేంద్ర మంత్రులను కూడా పిలుపుస్తున్నారు. ఇక ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోడీ ఎటూ వస్తున్నారు. వీరే కాకుండా ఢిల్లి కేంద్రంగా పని చేస్తున్న వివిధ దేశాల రాయబారులకు కూడా ఆహ్వానం పంపిస్తున్నారు. మొత్తంగా విశాఖ కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగేలా ఈ సదస్సును నిర్వహించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం భావిస్తోంది.