అమరావతి,ఆంధ్రప్రభ: భాష ఒక జాతి జీవం అని నమ్ముతూ తెలుగు భాష దీప్తిని, తెలుగు కార్టూన్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు అంతర్జాతీయ కార్టూన్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర తెలియజేశారు. మంగళవారం ఉదయం బెంజిసర్కిల్ సమీపంలో గల సర్వోత్తమ గ్రంథాలయం ఆడిటోరియంలో ఏర్పాటు- చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తానా తొలిసారిగా అంతర్జాతీయ తెలుగు కార్టూన్ (వ్యంగ్యచిత్రాలు) పోటీలు-2023 నిర్వహస్తున్నట్లు తెలియజేశారు.
ఈ పోటీలో ప్రపంచంలో ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా తెలుగు కార్టూనిస్టులు పాల్గొనవచ్చన్నారు. వ్యక్తులను, రాజకీయ పార్టీలను, మతాలను కించపరిచేలా కార్టూన్లు ఉండకూడదన్నారు. వ్యవస్థలోని లోపాలను తెలియజేస్తూ తెలుగు భాష, సంస్కృతుల గొప్పతనాన్ని సమాజానికి తెలియపరిచే విధంగా కార్టూన్లు పంపాలన్నారు. పోటీకి వచ్చిన కార్టూన్ల నుండి 12 అత్యుత్తమ కార్టూన్లను ఎంపిక చేసి ఒక్కొ కార్టూన్‌కు రూ.5 వేల రూపాయలు, మరో 13 ఉత్తమ కార్టూన్లకు రూ.3వేల చొప్పున మొత్తం 25 మందికి నగదు బహుమతులను అందజేస్తామన్నారు.
కార్టూన్ కలర్ లేదా బ్లాక్ అండ్ వైట్‌లో పంపించవచ్చునని, ఒక్కొక్కరూ మూడు కార్టూన్ల చొప్పున పంపించవచ్చునని చెప్పారు. కార్టూన్లను డిసెంబర్ 26వ తేదీలోపు పంపాలన్నారు. ఫలితాలను 2023 సంక్రాంతి అయిన జనవరి 15న ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహఖ సభ్యులు కళాసాగర్, కమిలీశ్రీ, జాకీర్లు పాల్గొన్నారు. పోటీలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకునేవారు 9154555675, 98852 89995 నెంబర్లలో సంప్రదించవచ్చునన్నారు.