Friday, November 22, 2024

కాంగ్రెస్‌ను ముంచిన అంతర్గత కలహాలు, పార్టీని చీల్చిన సిద్ధూ.. పీసీసీ పదవికి రాజీనామా

పంజాబ్‌ సీఎం పీఠం నుంచి అమరీందర్‌ సింగ్‌ వైదొలగడానికి ప్రధాన కారణమైన సిద్ధూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమి తరువాత పీసీసీ పదవికి రాజీనామా చేశారు. సీఎం పదవి ఆశించే పంజాబ్‌ కాంగ్రెస్‌లో మంట రాజేసిన సిద్ధూ.. ఆపై సీఎం కావొచ్చనే భావించాడు. కానీ అధిష్టానం చన్నీకి ఓటేసింది. ఇది సిద్ధూకు జీర్ణించలేదు. పార్టీ మారుదామనే ప్లాన్‌ చేశాడు. మొత్తం కాంగ్రెస్‌ విచ్ఛిన్నం చేద్ధామనే అనుకున్నాడు. వివాదాలకు ఆజ్యం పోశాడు. తనకు దక్కనిది మరొకరికి దక్కడంతో రగిలిపోయాడు. పైకి నవ్వుతూ కనిపించినా.. లోపల పేలేందుకు సిద్ధంగా ఉన్న ఓ అగ్ని పర్వతమే ఉంచుకున్నాడు. రాహుల్‌ జోక్యంతో సిద్ధూ దూకుడు తగ్గించాడు. కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా చన్నీని అధిష్టాం ఎంచుకున్నా.. మిన్నుకుండిపోయాడు.

సీఎం అభ్యర్థి విషయంలోనూ..
సీఎం అభ్యర్థిగా చన్నీ ఉంటే తనకేం సమస్యలేదని, తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని సిద్ధూ చెప్పుకొచ్చాడు. చన్నీ రెండు స్థానాల్లో ఓడిపోవడం.. తాను కూడా ఓ సామాన్య మహిళా కార్యకర్త చేతిలో పరాజయం పాలవ్వడంతో.. జీర్ణించుకోలేకపోయాడు. కాంగ్రెస్‌ ఘోర ఓటమి తరువాత.. రాజీనామా చేశాడు. సీఎం అభ్యర్థి విషయంలోనూ అధిష్టానం చాలా సమయం వృథా చేసింది. బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించడం కూడా కాంగ్రెస్‌ ప్రతికూల అంశమే. గురువారం సాయంత్రం సీఎల్‌పీ సమావేశం నిర్వహించాలని సిద్ధూ భావించాడు. అయితే ఎవరూ దీనికి సహకరించలేదని సమాచారం. ప్రజా తీర్పునకు కట్టుబడి ఉన్నా అనే ప్రకటన చేసి సైలెంట్‌ అయిపోయాడు. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు చేసిన నష్టమంతా చేసి.. ఇప్పుడు రాజీనామా చేసి చేతులు దులుపుకోవడంపై పలువురు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సిద్ధూపై గుర్రుగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement