హైదరాబాద్ – సంధ్య ధియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఆ కేసులను కొట్టి వేసేందుకు నిరాకరించింది. అయితే తమ క్లయింట్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అర్జున్ న్యాయవాదులు కోరారు.. దీనిపై స్పందించిన హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది..
అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. నాలుగు వారాల వెసులు బాటుతో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని హైకోర్టు తెలిపింది. యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమని పేర్కొంది. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం నటుడు కాబట్టే 105 (B), 118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్‌కు ఆపాదించాలా? అని హైకోర్టు స్పందించింది. రేవతి కుటుంబంపై సానుభూతి ఉందని తెలిపింది. అంత మాత్రాన నేరాన్ని ఒక్కరిపైనే రుద్దలేం అని పేర్కొంది. ఇప్పటికే చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అల్లు అర్జున్ నుంచి రూ.50 వేలు వ్యక్తిగత బాండ్ తీసుకుని తక్షణం విడుదల చేయాలని ఆ జైలు సూపరింటెండెంట్ ను హైకోర్టు ఆదేశించింది.