Tuesday, November 26, 2024

ఆసక్తి రేపుతున్న చకిలం.. పొంగులేటి భేటీ

ప్రభన్యూస్‌ ప్రతినిధి, నల్లగొండ : ఖమ్మం బీఆర్‌ఎస్‌ మాజీ నేత పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్‌ మాజీ నేత చకిలం అనిల్‌ కుమార్‌ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. శనివారం చకిలం ఖమ్మంలో పొంగులేటిని కలిసి భవిష్యత్తు రాజకీయ కార్యక్రమాలపై చర్చించారు. చకిలం కొంతకాలంగా పొంగులేటితో టచ్‌ లో ఉన్నారు. పొంగులేటితో చకిలం భేటీలో కొత్త పార్టీ పెట్టడమా లేక కాంగ్రేస్‌, బీజేపీ లలో ఏదో ఒక పార్టీలో చేరడమా అన్న విషయమై వారు మంతనాలు సాగించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి చకిలంతో పాటు ఇంకెవరైనా ఇతర పార్టీ ముఖ్యులు పొంగులేటితో జత కడతారా అన్న విషయంపై కూడా వారి భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

- Advertisement -

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ పార్టీల్లో టికెట్లు ఆశిస్తున్న వారిలో మెజారిటీ నేతలు పొంగులేటి పార్టీ పెడితే ఆ పార్టీలో చేరే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది. అదే జరిగితే పొంగులేటికి చెందిన ఖమ్మం జిల్లాలో, జూపల్లికి చెందిన మహబూబ్‌ నగర్‌ జిల్లాలో, చకిలం వంటి బీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తమ వర్గం బలోపేతం అవుతుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ పెడితే ఈ మూడు జిల్లాల్లో బలమైన నాయకులు తమ వెంట వస్తారని పొంగులేటి, జూపల్లి అంచనా వేస్తున్నారు.

అయితే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ సహా ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్త నాయకులను సమీకరించి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకే పొంగులేటి, జూపల్లి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. ఈ నెలాఖరులోగా పొంగులేటి, జూపల్లిల భవిష్యత్‌ రాజకీయ కార్యచరణ తేటతెల్లమవుతుందని వారి అనుచరులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement