Sunday, November 17, 2024

Delhi | చంద్రబాబు కేసులో ఆసక్తికర వాదనలు.. తదుపరి విచారణ 13కు వాయిదా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అమల్లో లేని చట్టాలు లేదా సెక్షన్ల ప్రకారం ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయవచ్చా అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ సీఐడీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గిని ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్‌కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం కూడా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ)పై వాదనలు ఆసక్తికరంగా సాగాయి. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం ముందు సోమవారం మధ్యాహ్నం నుంచి కోర్టు సమయం ముగిసేవరకు వాదనలు వినిపించిన చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు, మంగళవారం ఉదయం గం. 10.30 నుంచి తమ వాదనలు కొనసాగించారు.

చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే వాదనలు ముగించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు ప్రారంభించారు. మధ్యాహ్న భోజన విరామం వరకు ఈ వాదనలు కొనసాగాయి. భోజన విరామం అనంతరం కూడా విచారణ కొనసాగించి కేసును ముగించాల్సిందిగా చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా ధర్మాసనాన్ని కోరారు. అయితే ఉదయం నుంచి ఈ ఒక్క కేసుపైనే విచారణ జరగడంతో జాబితాలోని ఇతర కేసులను కూడా విచారణ జరపాల్సి ఉందని, మధ్యాహ్న భోజన విరామం అనంతరం వాటిని విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.

- Advertisement -

అందుకే తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేస్తామని వెల్లడించింది. ఆ సమయానికి హరీశ్ సాల్వే కోర్టు గదిలో అందుబాటులో లేకపోవడంతో ఆయనను సంప్రదించి చెబుతానని సిద్ధార్థ్ లూత్రా చెప్పారు. భోజన విరామం అనంతరం బెంచ్ కూర్చోగానే కేసును శుక్రవారం లేదా సోమవారానికి వాయిదా వేయాలన్న అంశంపై కాసేపు తర్జనభర్జన జరిగింది. చివరకు శుక్రవారం మధ్యాహ్నం గం. 2.00కు వాయిదా వేయడానికి వాదప్రతివాదులకు, ధర్మాసనానికి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.

అవినీతి నిరోధక చట్టం సెక్షన్లను తొలగిస్తే రిమాండ్ చెల్లుబాటు అవుతుందా? – ధర్మాసనం

చంద్రబాబు తరఫున వాదనల్లో ప్రస్తావించిన ప్రధానాంశం అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ). 2018 జులైలో ఈ చట్టంలో కొత్తగా చేర్చిన ఈ సెక్షన్ ప్రకారం పబ్లిక్ సర్వెంట్లపై దర్యాప్తు, నేర విచారణ జరపాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును ఎఫ్.ఐ.ఆర్‌లో చేర్చడం మొదలు అరెస్టు, రిమాండ్ వరకు ఎక్కడా కూడా ఈ సెక్షన్ ప్రకారం అనుమతి తీసుకోలేదు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే గత రెండ్రోజులుగా వాదనలు వినిపించారు.

2021 సెప్టెంబర్‌లో ఫిర్యాదు అందగా, దానిపై ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి అదే ఏడాది డిసెంబర్‌లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారని, అప్పటికి సెక్షన్ 17(ఏ) అమల్లోకి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడుకు అది వర్తిస్తుందని వాదించారు. తమ వాదనకు బలం చేకూర్చే ఉదాహరణలు, పాత తీర్పులను ప్రస్తావించారు. ప్రభుత్వాలు మారినప్పుడు రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా అడ్డుకోవడం కోసమే ఈ సెక్షన్‌ను చేర్చారని తెలిపారు.

సాల్వే వాదనలు ముగించిన తర్వాత ముకుల్ రోహత్గి (ఏపీ సీఐడీ తరఫున) వాదనలు ప్రారంభించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ చంద్రబాబు నాయుడుపై అవినీతి నిరోధక చట్టంతో పాటు భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ల ప్రకారం కూడా అభియోగాలు ఉన్నందున, ఒకవేళ సెక్షన్ 17(ఏ) నిబంధన కారణంగా అవినీతి నిరోధక చట్టాన్ని తొలగిస్తే ఆయన రిమాండ్ చెల్లుబాటు అవుతుందా అని ప్రశ్నించింది.

దీనిపై బదులిస్తూ కచ్చితంగా చెల్లుబాటు అవుతుందని, సెక్షన్ 17(ఏ) అనేది అవినీతి నిరోధక చట్టాన్ని వర్తింపజేసే విషయంలోనే తప్ప ఇతర చట్టాలను వర్తింపజేసే విషయంలో కాదని తెలిపారు. ఒక వ్యక్తి అవినీతితోపాటు మోసం చేసినప్పుడు అవినీతి నిరోధక చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం కేసు పెడతామని, సాంకేతిక కారణంగా అవినీతి నిరోధక చట్టాన్ని తొలగించినా సరే మోసానికి పాల్పడ్డ నేరంపై ఐపీసీ సెక్షన్ 420 కొనసాగుతుంది అని వివరించారు.

బాబు చర్యలతో ప్రభుత్వానికి భారీ నష్టం
————–
సాల్వే వాదనలను తిప్పికొడుతూ ముకుల్ రోహత్గీ ఈ కేసులో ఎలాంటి రాజకీయ కక్షసాధింపు లేదని అన్నారు. కేసు నమోదు చేసే సమయానికి చంద్రబాబు నాయుడు అసలు నిందితుల జాబితాలోనే లేరని, దర్యాప్తులో వెల్లడైన సమాచారం ఆధారంగా ఆయన్ను ఏ-37గా చేర్చి, ఆ తర్వాత అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. 2021లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయగా చంద్రబాబు పేరును చేర్చింది 2023లో కాబట్టి ఇది రాజకీయ కక్షసాధింపు అనడానికి తగిన కేసే కాదని వాదించారు. చంద్రబాబు చర్యల కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని రోహత్గి అన్నారు.

మరోవైపు నేరం జరిగిన సమయంలో సెక్షన్ 17(ఏ) ఉనికిలో లేదని, కాబట్టి అది చంద్రబాబుకు వర్తింపజేయడం కుదరదని అన్నారు. తాను ఈరోజు ఒక వ్యక్తిని కొడితే సెక్షన్ 323 ప్రకారం కేసు పెడతారని, రేపు ఆ సెక్షన్‌ను రద్దు చేసినంత మాత్రాన తనపై నమోదైన కేసు రద్దు కాదని అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనంలోని జస్టిస్ బేలా త్రివేది జోక్యం చేసుకుంటూ.. ఈ కేసులో సెక్షన్ 17(ఏ) అమల్లోకి వచ్చిన తర్వాతనే ఎఫ్.ఐ.ఆర్ నమోదైందని అన్నారు.

ఇందుకు బదులిస్తూ.. ఫిర్యాదు, ప్రిలిమినరీ ఎంక్వైరీ, ఎఫ్.ఐ.ఆర్ అన్నీ 2021లోనే జరిగినప్పటికీ.. ఈ మొత్తం కుంభకోణంలో నేరం వెలుగుచూసింది మాత్రం సెక్షన్ 17(ఏ) అమల్లోకి రాకముందేనని, 2018 మే నెలలో జీఎస్టీ-పూణే విభాగం నకిలీ బిల్లులను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫిర్యాదు లేఖ రాసిందని తెలిపారు. దానిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేత విచారణ జరిపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని తెలిపారు. ఆ లెక్కన విచారణ ప్రక్రియ కూడా కొత్త సెక్షన్ అమల్లోకి రాకముందే ప్రారంభమైందని వెల్లడించారు.

అమల్లో లేని చట్ట ప్రకారం ఇప్పుడు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయవచ్చా?

రోహత్గి వాదనల్లో మరోసారి జోక్యం చేసుకున్న జస్టిస్ బేలా త్రివేది “అమల్లో లేని పాతచట్టం ప్రకారం ఇప్పుడు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయవచ్చా” అని ప్రశ్నించారు. నేరం జరిగిన సమయంలో ఆ చట్టం అమల్లో ఉన్నట్టయితే కొన్ని పరిమితులకు లోబడి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయవచ్చని రోహత్గి అన్నారు.

కొన్ని కేసుల్లో నిందితులు పారిపోయి పదేళ్ల తర్వాత దొరుకుతుంటారని, ఒక్కోసారి నేరం కూడా పదేళ్ల తర్వాత బయటపడుతూ ఉంటుందని, అలాంటప్పుడు కూడా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సెక్షన్ 17(ఏ)ను అవినీతి నిరోధక చట్టంలో చేర్చినప్పుడు, ఆ ఒక్క పనిమాత్రమే చేయలేదని, చట్టంలోని మిగతా సెక్షన్లను సవరించి, ఈ సెక్షన్‌ను కొత్తగా చేర్చారు కాబట్టి మొత్తం జరిగిన మార్పులను ఒక ప్యాకేజిగా గుర్తించాల్సి ఉంటుందని రోహత్గి అన్నారు.

గతంలోకి పారాష్యూట్ వేసుకుని దూకలేం

ఎప్పుడైనా సరే ఒక కొత్త చట్టం లేదా సెక్షన్‌ను చేర్చుతూ పార్లమెంట్ బిల్లు పాస్ చేసినప్పుడు, అది ఆ తర్వాత నుంచి అమల్లోకి వస్తుంది తప్ప ప్యారాష్యూట్ వేసుకుని గతంలోకి దూకదని రోహత్గి అన్నారు. ఒకవేళ కొత్తగా తెచ్చే చట్టంలో “ఈ కొత్త నిబంధన అప్పటికే నమోదైన పాత కేసులకు, లేదా గతంలో జరిగిన నేరాలకు సైతం వర్తిస్తుంది” అని ప్రత్యేకంగా పేర్కొంటే తప్ప గతంలో జరిగినవాటికి వర్తింపజేయలేం అని రోహత్గి వాదించారు.

సెక్షన్ 17(ఏ) విషయంలో పార్లమెంట్ అలా చెప్పలేదు కాబట్టి అది అమల్లోకి రాకముందు జరిగిన నేరాలకు వర్తింపజేయడం తగదని తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఉద్దేశం ఈ సెక్షన్ ద్వారా అవినీతిపరులకు రక్షణ కల్పించడం కాదని రోహత్గి వ్యాఖ్యానించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన చోట, భారీస్థాయిలో అవినీతికి పాల్పడిన చోట నిందితులకు రక్షణ అన్న అంశమే తలెత్తదని అన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 482 ప్రకారం దాఖలైన క్వాష్ పిటిషన్‌లో ఆధారాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి తప్ప వాదనలను బట్టి కాదని సూచించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement