న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వ్యవసాయ రంగంలో రైతులకు రుణాల లభ్యతను మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి, స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై 1.5 శాతం వార్షిక వడ్డీ రాయితీ పథకాన్ని పునరుద్ధరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం (ప్రభుత్వ-ప్రైవేటు రంగ, స్వల్ప రుణ, ప్రాంతీయ గ్రామీణ, సహకార బ్యాంకులు సహా కంప్యూటరీకరించిన వాణిజ్య బ్యాంకుల అధీనంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కలుపుకుని) ఆర్థిక సహాయ సంస్థలకు 1.5 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుంది. ఈ మేరకు 2022-23 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో రూ.3 లక్షల వరకూ రైతులకు మంజూరు చేసిన స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రాయితీ అమలవుతుంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వంపై మూడేళ్లలో మొత్తం రూ.34,856 కోట్ల మేర అదనపు భారం పడుతోంది.
వడ్డీ రాయితీ పెంపుతో వ్యవసాయ రంగంలో రుణాల మంజూరులో స్థిరత్వం ఏర్పడటమేగాక రుణాలిచ్చే సంస్థల ఆర్థిక సుస్థిరత, మనుగడకు భరోసా లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రుణాల మంజూరుకు నిధుల లభ్యతపై హామీ ఉంటుంది. నిధుల వితరణలో పెరిగే వ్యయాన్ని బ్యాంకులు తట్టుకోగలుగుతాయి. తద్వారా స్వల్పకాలిక వ్యవసాయ అవసరాల కోసం రైతులకు తగుమేర రుణాలు మంజూరుచేసే వీలుంటుంది. అంతేకాకుండా మరింత మంది రైతులు వ్యవసాయ రుణ ప్రయోజనం పొందగలుగుతారు. అలాగే పశు పోషణ, పాడి, కోళ్ల పెంపకం, చేపల పెంపకం వంటి కార్యకలాపాలకు సైతం స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు లభిస్తాయి. దీంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. సకాలంలో తిరిగి చెల్లించే రైతులు 4 శాతం స్వల్ప వార్షిక వడ్డీతో వ్యవసాయ రుణాలను సద్వినియోగం చేసుకునే అవకాశం లభిస్తుంది.
రైతులకు తక్కువ వడ్డీతో చిక్కుల్లేని రుణ లభ్యత కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘కిసాన్ క్రెడిట్ కార్డ్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా వారు వ్యవసాయ ఉత్పత్తులు, సేవలను ఏ సమయంలోనైనా రుణం కింద కొనుగోలు చేసే సాధికారత లభించింది. అదేవిధంగా రైతులు బ్యాంకుకు కనీస శాతం వడ్డీ చెల్లించేలా భరోసా ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రైతులకు తగ్గింపు వడ్డీతో స్వల్పకాలిక రుణాలివ్వడం కోసం దీనికి ‘సవరించిన వడ్డీ రాయితీ పథకం’గా పేరు మార్చి అమలు చేయాలని నిర్ణయించింది. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద ఇటీవల 2.5 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ లక్ష్యానికి మించి 3.13 కోట్ల మంది రైతులకు కొత్త కార్డులు జారీ అయ్యాయి.
మారుతున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ముఖ్యంగా సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మంజూరు చేసే రుణాలపై వడ్డీ శాతాలతో పాటు వాటికి అందే ఆర్థిక సహాయంపై విధించే వడ్డీ రేట్ల పెరుగుదలను ప్రభుత్వం సమీక్షించి తాజా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వ్యవసాయ రంగంలో రైతులకు రుణ సాయం కోసం తగినంత రుణ ప్రవాహ లభ్యతకు భరోసా ఉంటుంది. దీంతోపాటు రుణ మంజూరు సంస్థల ఆర్థిక మనుగడకు హామీ లభిస్తుందని కేంద్ర మంత్రిమండలి అంచనా వేస్తోంది.