హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు సోమవారం ప్రకటించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను మార్చి 4న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను మార్చి 6న నిర్వహించనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభమవగా, ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రెండు సెషన్‌లలో జరగనున్నాయి. ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ ఈమేరకు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఒకేషనల్ కోర్సుకు సంబంధించిన టైం టేబుల్‌ను ప్రత్యేకంగా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్ బోర్డు ముందస్తుగా ప్రకటించినట్లుగా ఈసారి వంద శాతం సిలబస్‌తో ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే ఇంటర్ ప్రాధాన పరీక్షలు మార్చి 29న ముగియనున్నాయి. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఇక ఎంసెట్ షెడ్యూల్‌ను సైతం ఉన్నత విద్యామండలి త్వరలో ప్రకటించనుంది.