Thursday, November 21, 2024

ముగిసిన ఇంట‌ర్‌ పరీక్షలు.. జూన్‌ 20లోపు ఫలితాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఇంటర్‌ ప్రధాన పరీక్షలు ముగిశాయి. గురువారం సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు జరిగిన కెమిస్ట్రీ, కామర్స్‌ పరీక్షలతో దాదాపు పరీక్షలు ముగిసినట్లే. కేవలం ఇంకా పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఒకేషనల్‌ రెండు చిన్న పరీక్షలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పరీక్షలను 5 వేలలోపే విద్యార్థులు రాస్తారు. ఇక ప్రధాన పరీక్షలు ముగియడంతో ఇంటర్‌ బోర్డు అధికారులు ఫలితాలపై దృష్టి సారించారు. జూన్‌ 20లోపు ఫలితాలను ప్రకటించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మొదటి పరీక్ష నుంచి చివరి పరీక్ష వరకు తప్పుల తడక నడుమే పరీక్షలు ముగిశాయి. గతంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా 400 వరకు కాపీయింగ్‌ చేస్తూ ఇన్విజిలేటర్లు, స్పెషల్‌ స్కాడ్‌ బృందాలకు విద్యార్థులు పట్టుబడుతుండేవారు. ఈసారి 150 మందిలోపే ఆ సంఖ్య ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన పరీక్షలకు ప్రతి రోజూ సుమారు 20 వేల నుంచి 27 వేల మంది వరకు విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈనెల 22 నుంచి 31 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్‌ వ్యాల్యుయేషన్‌) చేపట్టనున్నారు. మొత్తం 15 సెంటర్‌లలో మూల్యాంకనం చేపడుతున్నారు. ఈసారి నిర్మల్‌, సిద్దిపేట్‌, మంచిర్యాలలో కొత్తగా మూల్యాంకనం కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూల్యాంకనంలో 15 వేల మంది పాల్గొంటారని ఇంటర్‌ బోర్డు అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు ఈనెల 6వ తేదీన ప్రారంభమయ్యాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ముగియగా, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు గురువారం ముగిశాయి. విద్యార్థులు చివరి రోజు కామర్స్‌, కెమిస్ట్రీ పరీక్షలు రాశారు. ఈనేపథ్యంలో తెలంగాణ ఇంటర్‌ బోర్డు సెక్రటరీ ఉమర్‌ జలీల్‌ మీడియాతో మాట్లాడారు. రెండు చిన్న పరీక్షలు మినహా ప్రధాన పరీక్షలన్నీ ముగిశాయన్నారు. ఈ సారి పరీక్షల్లో చిన్న చిన్న ప్రింటింగ్‌ తప్పులు దొర్లాయని తెలిపారు. అయితే పొరపాట్లను వెంటనే సరిదిద్దామని పేర్కొన్నారు. నెలలోపు ఇంటర్‌ ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. వచ్చే ఇంటర్‌ పరీక్షల్లో తప్పులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్‌ మీడియాలలో వేర్వేరు ప్రశ్నలు వచ్చిన చోట ఏ ప్రశ్నకు సమాధానం రాసినా వాటిని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఆ విషయంలో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. 9 లక్షల 7వేల మంది పరీక్షలు రాశారన్నారు. విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే 18005999333 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. మొత్తంగా పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement