హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ప్రకటించింది. విద్యార్థులు మంచి మార్కులు సాధించడంలో ఇది సహాయపడుతుందని తెలిపింది. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా కొత్త పాఠ్య ప్రణాళిక (న్యూ కరిక్యులమం ఫ్రేమ్‌వర్క్)ను రూపొందించింది. దానిప్రకారమే 2024-25 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలు రూపొందించాలని చెప్పింది.
విద్యార్థులు ఇకపై రెండు సార్లు బోర్డు పరీక్షలు రాయడంతో ఆయా సబ్జెక్టుల్లో సాధించిన ఉత్తమ స్కోరును ఎంచుకొనే అవకాశం కలగనుంది. ఇలా ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గడంతోపాటు వారి స్కోరును మెరుగుపరుచుకోవచ్చని విద్యాశాఖ స్పష్టం చేసింది. అదేవిధంగా 11, 12వ తరగతుల విద్యార్థులు రెండు లాంగ్వేజ్‌లను కచ్చితంగా అభ్యసించాలని, వీటిలో ఒకటి భారతీయ భాష అయి ఉండాలని పేర్కొంది.
బట్టీ చదువులకు స్వస్తిపలికేలా కొత్త పరీక్షల విధానం ఉంటుందని తెలిపింది. అలాగే నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం 11, 12 తరగతుల్లోని సబ్జెక్టుల ఎంపిక కేవలం ఆర్ట్స్, సైన్స్, కామర్స్ వంటి గ్రూపులకు మాత్రమే పరిమితం కాదని తెలిపింది. ఇప్పటి వరకు విద్యార్థుల సబ్జెక్టుల ఎంపికపై పలు నిబంధనలు ఉండేవి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఇలా ఏదైనా గ్రూప్‌లో చేరితే అందులోని సబ్జెక్టులనే విద్యార్థులు ఎంపిక చేసుకోవాల్సి ఉండేది.
ఇకపై ఆ విషయంలో నిబంధనలు ఉండవు. ఇంటర్ స్టూడెంట్స్‌కు సబ్జెక్టుల ఎంపికపై స్వేచ్ఛ ఇస్తున్నారు. అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా సబ్జెక్టుల ఎంపిక చేసుకోవచ్చు. సబ్జెక్టులపై పూర్తి అవగాహన, ప్రాక్టికల్స్ నైపుణ్యాలను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా నూతన పాఠ్యప్రణాళిక రూపకల్పన చేశారు.
మంచి మార్కుల కోసం…
11, 12 తరగతి విద్యార్థులు ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడంవల్ల విద్యార్థులు మంచి పనితీరు కనబరిచేందుకు తగినంత సమయం దొరుకుతుంది. అలాగే వారు మంచి మార్కులు సాధించేందుకు ఉపయోగపడుతోంది. బోర్డు పరీక్షల కోసం నెలల తరబడి పాఠ్యాంశాలను కంఠస్థం చేయకుండా వారి సామర్థ్యాలను పెంచుకునేందుకు ఇది సాయపడుతోందని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది.
తరగతి గదిలో ఎక్కువగా పాఠ్యపుస్తకాలపై ఆధారపడే పద్ధతిని నివారించాలని నిర్ణయించింది. ఈమార్పు పాఠ్య పుస్తకాల ధరను కూడా బాగా తగ్గించనుంది. సబ్జెక్టులపై అవగాహన, ప్రాక్టికల్ నైపుణ్యాలను విద్యార్థులకు అందించేలా కొత్త పాఠ్యప్రణాళిక ఉంటుందని కేంద్రం తెలిపింది.