హైదరాబాద్, ఆంధ్రప్రభ: కొన్ని ప్రైవేట్ కాలేజీల బోగస్ ర్యాంకుల ప్రకటనలకు ఇంటర్ బోర్డు అడ్డుకట్ట వేయనుంది. విద్యార్థి కేవలం టెన్త్ మాత్రమే తమ విద్యాసంస్థలో చదువుకున్నాగానీ, ఇంటర్‌లో వేరే విద్యా సంస్థలో చదివినా, ఒక సంవత్సరం ఒక చోట, జేఈఈ, ఎంసెట్ కోచింగ్ తీసుకోకపోయిన ఆ విద్యార్థికి వచ్చే ర్యాంకును తమకే వచ్చినట్లుగా కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్వర్టయిజ్‌మెంట్లను ఇచ్చేసుకుంటున్నాయి. అంతేకాకుండా ఎంసెట్, జేఈఈ, నీట్‌లో తమ విద్యాసంస్థ వరుసగా ఒకటి, రెండు, మూడు, నాలుగు ఇలా వరుసగా ర్యాంకులు సాధించిందని ఊదరగొట్టే ప్రచారం చేసుకునేటువంటి కళాశాలలకు అడ్డుకట్ట వేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. ఇంటర్ ఫలితాల సందర్భంగా నాంపల్లిలోని బోర్డు కార్యాలయంలో ఆయన మిడియాతో మంగళవారం చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాల గురించి ప్రస్తావించారు. నాలుగైదు రోజుల్లో ప్రైవేట్ కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని, ఇప్పటికే 50 శాతం పూర్తయిందని చెప్పారు.
అయితే ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు పత్రికల్లో, మీడియాలో ప్రచురించే యాడ్స్‌పై మార్గదర్శకాలను రూపొందించినట్లు తెలిపారు. తప్పుడు ర్యాంకులతో విద్యార్థులను చేర్చుకునే విధానానికి అడ్డుకట్ట వేసేలా ఉన్నతాధికారులతో పర్యవేక్షణ కమిటీని నియమించినట్లు తెలిపారు. ఇక నుంచి జూనియర్ కాలేజీలు ప్రత్రికలు, మీడియాకు అడ్వర్టయిజ్‌మెంట్ ఇవ్వాలనుకుంటే ఇంటర్ బోర్డు అనుమతి తప్పక తీసుకోవాల్సిందేనని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న దాదాపు 24 గంటల్లోనే కమిటీ పరిశీలించి అనుమతి ఇస్తుందన్నారు. అనుమతివ్వాలంటే ర్యాంకులు, సమాచారం, కంటెంట్ పక్కాగా ఉండాలని, ఒకవేళ అందులో వాస్తవం లేకుంటే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. యాడ్స్‌లో తప్పుడు సమాచారం ఒకవేళ ఉంటే ఎన్ని లక్షలైతే యాడ్స్‌కు ఖర్చు అవుతుందో అంతే మొత్తాన్ని ఆయా కాలేజీ యాజమాన్యాల నుంచి వసూలు చేస్తోందని తెలిపారు.
ఉదాహరణకు రూ.కోటి ఖర్చు అయితే ఆ కాలేజీ నుంచి రూ.కోటి వసూలు చేస్తామని ఆయన వివరించారు. ఒక విద్యార్థి సాధించిన ర్యాంకును రెండు మూడు కాలేజీలు క్లెయిమ్ చేసుకుంటున్నాయని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ప్రకటనలు ఇవ్వాలనుకుంటే ఆ విద్యార్థి తమ విద్యాసంస్థల్లో చదువుకున్న పూర్తి సమాచారం యాడ్‌లో ప్రచురించాలని తెలిపారు. ఎంసెట్, జేఈఈ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ ర్యాంకులను ఓపెన్ ర్యాంకులుగా ప్రకటిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఏదైతే ర్యాంకు సాధించారో అదే ర్యాంకును ప్రకటించుకోవాలని సూచించారు.
ఈ మార్గదర్శకాలు ఈ విద్యాసంవత్సరం నుంచి తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇంటర్ జవాబు పత్రాల ఆన్‌లైన్ మూల్యాంకనంపై వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి దోస్త్ తరహాలో ఆన్‌లైన్‌లో ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియను చేపడతామన్నారు. మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉండే కళాశాలలకు ఈ విద్యా సంవత్సరం మాత్రమే అనుమతి ఉంటుందని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి వాటికి అనుమతిచ్చేది లేదని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇది గమనించాలని, తెలుసుకొని అడ్మిషన్లు తీసుకోవాలని సూచించారు.