Wednesday, November 20, 2024

20వ తేదీ నుంచి ఇంటర్‌ అడ్మిషన్లు.. ఈసారి ఆఫ్‌లైన్‌లోనే

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రవేశాల కోసం షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 20వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. గత రెండేళ్లుగా ఆన్‌లైన్‌ విధానంలో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నాలు చేయగా.. హైకోర్టు కొట్టేస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అడ్మిషన్ల స్వీకరణ పూర్తి ఆఫ్‌లైన్‌ విధానంలోనే జరగనుంది. అన్ని ప్రభుత్వ యాజమాన్య, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ తదితర జూనియర్‌ కళాశాలలన్నీ సోమవారం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించవచ్చని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు తెలిపారు. ఈ నెల 20 నుంచి దరఖాస్తుల విక్రయం, 27 నుంచి మొదటి దశ అడ్మిషన్ల స్వీకరణ ప్రారంభించి జూలై 20వ తేదీలోగా మొదటి దశ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జూలై ఒకటో తేదీ నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు తరగతులు ప్రారంభం కానున్నాయి. కళాశాలల ప్రిన్సిపాల్స్‌ ఇంటర్‌నెట్‌లో డౌన్‌లోడ్‌ చేసిన మార్కుల మెమోల ఆధారంగా ప్రాథమికంగా అడ్మిషన్లు చేపట్టాలని, ఒరిజినల్‌ సర్టిఫికెట్‌తోపాటు, టీసీలు సమర్పించిన తర్వాత ఖరారు చేయనున్నారు.

రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు..

ఇంటర్మీడియట్‌ అడ్మిషన్లలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను పక్కాగా అమలు చేయనున్నారు. మొత్తం అడ్మిషన్లలో మూడింట ఒక వంతు(33.33 శాతం) బాలికలకు కేటాయిస్తారు. అలాగే ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీలకు 29 శాతం(కేటగిరిల ప్రకారం), పీహెచ్‌కు 3, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌కు 5 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు పది శాతం, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, డిఫెన్స్‌ పర్సనల్స్‌కు 3 శాతం కోటా వర్తిస్తుంది. అడ్మిషన్లను మార్కుల ప్రకారమే కేటాయించాలని, ప్రైవేట్‌, కార్పొరేట్‌ తదితర జూనియర్‌ కళాశాలలు వేరే టెస్టులు నిర్వహించడం, ఇతర విధానాన్ని అనుసరించి అడ్మిషన్లు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని బోర్డు స్పష్టం చేసింది. అన్‌ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు శాంక్షన్‌ చేసిన సెక్షన్ల మేరకు మాత్రమే(ఒక్కో సెక్షన్‌కు 88) సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. అడ్మిషన్ల సమయంలో అన్ని కళాశాలలు సీట్ల వివరాలు ప్రదర్శించడంతోపాటు, భర్తీ అయిన వివరాలనూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి. అడ్మిషన్లకు సంబంధించి ఏ అన్‌ఎయిడెడ్‌ కళాశాలలు ఎలాంటి ప్రకటనలు ఇవ్వడానికి వీలు లేదని బోర్డు స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement