హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. టెట్ పేపర్-1కు గతంలో ఎన్నడూ లేనంతగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకుంటుండడం గమనార్హం. ఈనెల 12 దరఖాస్తుకు చివరి తేదీ ఉండడంతో అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు ఎస్‌జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్)గా నియమితులవ్వాలంటే టెట్ పేపర్-1లో అర్హత సాధించాల్సి ఉంటుంది. పేపర్-1 రాయాలంటే డీఎడ్ చేసిన అభ్యర్థులే అర్హులు. అయితే పేపర్-2 స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు పోటీ పడే బీఎడ్ అభ్యర్థులకు సైతం పేపర్-1 రాసే అవకాశం ఇచ్చారు. దాంతో పేపర్-1కు పోటీ ఎక్కువైంది. ఈక్రమంలోనే పేపర్-1కు డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు పోటీపడుతున్నారు. బుధవారం రాత్రి వరకే పేపర్-1కు 2.13 లక్షల దరఖాస్తులు రాగా, పేపర్-2కు 1.60 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. గురువారం వరకు వచ్చిన దరఖాస్తులను కూడా కలుపుకుంటే కేవలం పేపర్-1కు వచ్చిన దరఖాస్తులే సుమారు 2.5లక్షలకు చేరువలో ఉంటాయని తెలుస్తోంది.
ఈసారే ఎక్కువ దరఖాస్తులు…
ఎస్‌జీటీ పోస్టులు దాదాపు 6వేలకు పైగా ఉంటే, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2వేలకు పైగా ఉన్నాయి. ఎస్‌జీటీ పోస్టులు ఎక్కువగా ఉండడంతో అటు డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు చాలా మంది పేపర్-1కు ఎక్కువగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. డీఎడ్ వాళ్లకంటే కూడా బీఎడ్ చేసిన వారు పేపర్-1లో సులువుగా అర్హత సాధించే వీలుంది. తెలంగాణ రాష్ట్రంలో 2016, 2017లో నిర్వహించిన టెట్‌లోనూ పేపర్-1కు ఈ స్థాయిలో దరఖాస్తులు రాలేదు. దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా 5 రోరోజుల గడువుంది. అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులనూ లెక్కేసుకుంటే 2.50 లక్షలు దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 2016లో నిర్వహించిన టెట్ పేపర్-1కు 88,661 మంది హాజరుకాగా, 2017లో 98,848 మంది హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో తొలి టెట్ 2011లో జరగ్గా, తెలంగాణలో 22-5-2016లో తొలి టెట్ నిర్వహించారు. ఆ తర్వాత రెండోసారి టెట్‌ను 23-7-2017లో నిర్వహించారు. అప్పటి నుంచి ఇంత వరకు మళ్లిd టెట్‌ను నిర్వహించలేదు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మూడో సారి టెట్‌ను నిర్వహిస్తుంది. టీచర్ల భర్తీ ప్రక్రియకు ప్రభుత్వం చేపడుతుండటంతో పాటు, టెట్‌కు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడంతో డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన వారు టెట్ రాసేందుకు పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే పపర్-1కు కేవలం డీఎడ్ అభ్యర్థులకే అవకాశం కల్పించాలని, బీఎడ్ అభ్యర్థులకు ఇవ్వొద్దని డీఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..