నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పాలసీదారుల బీమా సొమ్మును స్వాహా చేస్తున్న ముఠాకు చెందిన 8 మంది నిందితులను టాస్క్ ఫోర్స్, నల్లబెల్లి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. కాగా, మరో 11మంది నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ కేసులో నిందితుల అరెస్టుకు సంబంధించి అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఇవ్వాల (మంగళవారం) వివరాలు వెల్లడించారు. ఈ ముఠా నుండి పోలీసులు ఒక కారు, ట్రాక్టర్, లక్ష రూపాయల నగదు, ల్యాప్ టాప్, నకిలీ ధ్రువీకరణ పత్రాలు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో పుప్పాల రాము, చిట్యాల శ్రీకాంత్ ప్రధాన నిందితులతో పాటు ములుగు జిల్లా మల్లంపెల్లికి చెందిన గన్నారపు మహేందర్, నల్లబెల్లి మండలానికి చెందిన వైనాల పవన్, అడ్డారాజు, మడిపల్లి వెంకట్రాజం.. హైదారాబాదుకు చెందిన జి.మల్లేష్, డి. వెంకట్ రావు ను పోలీసులు అరెస్ట్ చేశారు. గండు శ్రీనివాస్, ఇస్లావత్ రమేష్, నాతి శ్యాం, ఎండీ రఫీ, దూడల రాజేష్, చిట్యాల సురేష్, గండు మహేందర్, కనుగంటి సుమన్, ఇస్లావత్ రాజ్ కుమార్, భూక్యా భాస్కర్, భూక్యా శంకర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.