Monday, November 18, 2024

పోలవరంపై విచారణ వాయిదా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పోలవరం ప్రాజెక్టు ముంపు నేపథ్యంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. గత విచారణ సందర్భంగా ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిపి సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. ముఖ్యమంత్రుల సమావేశం ద్వారా రాజకీయ పరిష్కారం కోసం ప్రయత్నించాలని సూచించింది. గత ఏడాది సెప్టెంబర్ 6న ఈ ఆదేశాలు జారీ చేయగా, పోలవరంపై ముఖ్యమంత్రుల సమావేశం ఇప్పటి వరకు జరగలేదు.

సమావేశం నిర్వహించడం కోసం ప్రయత్నించామని, ముఖ్యమంత్రులు సమయం కేటాయించకపోవడం వల్ల సాధ్యపడలేదని కేంద్రం కోర్టుకు తెలిపింది. కేంద్ర జలశక్తి శాఖ, ముఖ్యమంత్రులతో నిర్వహించే ఈ సమావేశం కోసం సంప్రదింపులు కొనసాగుతున్నాయని, ఈ క్రమంలో మరో 4 వారాల పాటు విచారణ వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కేంద్రం కోరింది. ఈ మేరకు శనివారమే సుప్రీంకోర్టుకు కేంద్రం లేఖ రాసింది. కేంద్రం లేఖను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం, సోమవారం కేసుల జాబితా నుంచి పోలవరం కేసును తొలగించింది. తదుపరి విచారణ తేదీని ఇంకా ప్రకటించలేదు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement