న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తవుతున్నా నీటి వాటాల్లో అన్యాయం కొనసాగుతూనే ఉందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద టీజేఎస్ తలపెట్టిన నిరసన ప్రదర్శనలో ఆయన తెలంగాణ రాష్ట్ర జలవనరుల సమస్యలపై గళమెత్తారు. విభజన హామీలు, జలవనరుల దోపిడీపై 150 మంది పార్టీ నేతలు, ప్రజా సంఘాల నేతలతో కలిసి గంటపాటు మౌనదీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కృష్ణా నది జలాల వాటాల్లో తెలంగాణ రాష్ట్రానికి సరైన న్యాయం జరగలేదని అన్నారు. న్యాయబద్ధమైన వాటా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం జరిగిందని, కానీ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు దాటినా ఇప్పటికీ నీటి వాటాల పంపకాలు జరగలేదని అన్నారు.
కృష్ణానది తీర ప్రాంతం తెలంగాణలో 78 శాతం ఉండగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 899 టీఎంసీల్లో తెలంగాణకు దక్కింది కేవలం 299 టీఎంసీలు మాత్రమేనని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రాజెక్టులు వరద జలాల ఆధారంగా నడుస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోవడంతో 28 లక్షల ఎకరాల్లో సాగు ఆగిపోయిందని కోదండరాం తెలిపారు. కృష్ణా జలాల వాటాలపై ట్రిబ్యునల్ వేసి వాటా లెక్కలు తేల్చాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అన్యాయం జరుగుతోందని విమర్శించారు.
కేసుల నుంచి తమను కాపాడుకోవడం కోసం మాత్రమే ఢిల్లీకి వస్తారని, రాష్ట్ర సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదని కోదండరాం ఆరోపించారు. ఇప్పుడు పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పోటీ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ సమస్యలపై పోరాడే అవకాశం లేదని సూత్రీకరించారు. ఈ పరిస్థితుల్లో తాము రాష్ట్ర సమస్యలపై కేంద్రానికి మెమోరాండం ఇవ్వడం కోసం ఢిల్లీలో కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనపై సెమినార్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
విభజన చట్టంలో 10 వ షెడ్యూల్ లో ఉన్న 93, 94, 95 ప్రకరణలు చాలా కీలకమైనవని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు, పారిశ్రామిక రాయితీలు ఇందులో పొందుపరిచారని కోదండరాం వెల్లడించారు. తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్ వీటిపై ఏనాడూ దృష్టిపెట్టలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలు అడగకపోవడంతో కేంద్రం కూడా పట్టించుకోలేదని అన్నారు. ఢిల్లీలో కార్యక్రమాలు ముగిసిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తెలంగాణ సమస్యలపై పోరాటం మొదలుపెడతామని కోదండరాం ప్రకటించారు.