Thursday, November 21, 2024

Delhi: ఉద్యమకారులకు అన్యాయం, కేసీఆర్‌ను కలిసేదాకా ఢిల్లీలోనే ఉంటా: విద్యార్థి నేత పడిగాపులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడికి వారికి సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తమ వంటి ఉద్యమకారులకు ఎందుకు సహాయం చేయరని ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని, టీఆర్‌ఎస్ స్టూడెంట్ యూనియన్ నాయకురాలు, తెలంగాణ ఉద్యమకారిణి ధాత్రికా స్వప్న ప్రశ్నించారు. కేసీఆర్‌ను కలిసేందుకు ఆమె రెండురోజులుగా సీఎం కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్నారు. శనివారం ధాత్రికా స్వప్న మీడియా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ఢిల్లీ వచ్చానని తెలిపారు.

ప్రగతి భవన్‌లో అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ఢిల్లీలో కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చానన్నారు. తాను కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తుంటే భద్రతా సిబ్బంది ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారిణిగా తనకు మంచి పేరుందన్న ఆమె, విశిష్ట ఉద్యమకారిణిగా కేసీఆర్ నుంచి అవార్డు కూడా అందుకున్నానని గుర్తు చేశారు. డాక్టరేట్ పొంది కూడా అనేకమంది విద్యావంతులు తెలంగాణలో నిరుద్యోగులుగా మిగిలిపోయారని ధాత్రిక వాపోయారు.

టీఆర్ఎస్ పార్టీలో అవకాశం కల్పిస్తానని గతంలో కేసీఆర్ తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని గుర్తు చేయడానికి ఢిల్లీ వచ్చానన్నారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని, వారందరికీ అవకాశం కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేంతవరకు ఇక్కడే ఉంటానని ధాత్రికా స్వప్న భీష్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement