Tuesday, November 26, 2024

Water Matters | ఆర్డీఎస్‌ నీటివాటాలో దశాబ్దాలుగా అన్యాయం.. ప్రత్యామ్నాయంగా తుమ్మిళ్ల నిర్మాణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆర్డీఎస్‌ నిబంధనల మేరకు నీటిని వినియోగించుకునేందుకు పట్టుసడలించకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. గత సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ వాటా నీటిని దశాబ్దాల నుంచి వినియోగించుకోలేని పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కాప్రణాళికతో ముందుకు వెళ్లుతోంది. తుంగభద్ర నీటి మళ్లింపు పథకం ద్వారా తెలంగాణ,ఆంధ్ర,కర్ణాటకు నీటి హక్కు ఉన్నప్పటికీ వినియోగించుకోలేని పరిస్థితి తెలంగాణలో ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఎస్‌ ఆధునీకరణ పథకాన్ని రూపొందించి నిర్మాణ పనుల్లో నిమగ్నమైంది. తంగభద్ర బ్యాక్‌ వాటర్‌ నుంచి వాటామేరకు వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనుల్లో ప్రభుత్వం వేగం పెంచింది. అయితే ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ సర్కార్‌ చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ అడ్డుకుంటూ నిబంధనలమేరకు నిర్మిస్తుంది.

ఆర్డీఎస్‌ నుంచి తెలంగాణ వాటాగా 15.9 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ కేవలం 5.53 టీఎంసీల నీరు అందడం గగనమైంది. అయితే ఏపీ వాటా 31.9 టీఎంసీలు ఉండగా అక్రమంగా 41.26 టీఎంసీల నీటిని కేసీ కెనాల్‌ ద్వారా తరలిస్తోందని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌ ఇప్పటికే సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని బహిరంగ పర్చారు. అలాగే గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకాన్ని ఏపీ తలపెట్టి ఆర్డీఎస్‌ నుంచి సుంకేశుల తీరప్రాంతాల మధ్య 13 ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను ప్రారంభించేందుకు రూపొందించిన ప్రణాళికను తెలంగాణ తప్పుబట్టింది. అయితే ఆర్డీఎస్‌ వాటాను వినియోగించుకోవడానికి తెలంగాణ చేస్తున్న ప్రయత్నాలను ఏపీ ఎప్పటికప్పుడు అడ్డుకొంటుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ నివేదిక మేరకు మూడు రాష్ట్రాలు ఆర్డీఎస్‌ సామర్ధ్యం పెంచేందుకు నిర్ణయించి ఎనిమిది ప్యాకేజీలుగా పనులు చేసేందుకు నిర్ణయించాయి.

- Advertisement -

ఇందులో భాగంగా తెలంగాణ తన వాటాగా రూ. 58 కోట్లు డిపాజిట్‌ చేసినా పనులు మాత్రం ప్రారంభం కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిళ్ళ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచి మరి కొద్ది మాసాల్లో ప్రారంభానికి సిిద్ధం చేస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని వాడేపల్లి దగ్గర తుమ్మిళ్ళగ్రామ పరిధిలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం రూ. 783కోట్ల పరిపాలనాపరిమైన అనుమతులను ఇచ్చింది. ఈప్రాజెక్టు స్టేజీ వన్‌ పనులు సెప్టెంబర్‌ 2017 లో ప్రారంభంకాగా 2023 జూలై లోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం పనుల్లో వేగం పెంచింది. ఇప్పటివరకు రూ. 158కోట్ల 94 లక్షల విలువైన పనులు పూర్తి అయ్యాయి. 2వ దశలో ప్రతిపాదిత మల్లమ్మ కుంట రిజర్వాయర్‌ కోసం నిర్ధేశించిన 3వ పంపింగ్‌ స్టేషన్‌లో పంపుల బిగింపు పూర్తి అయింది. రెండవ దశలో సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు 1టీఎం సీ సామర్ధ్యంతో మల్లమ్మకుంట దగ్గర రిజర్వాయర్‌ ఏర్పాటు పనులపై నీటి పారుదల శాఖ దృష్టి సారించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement