Tuesday, November 26, 2024

ఇన్ఫోసిస్‌ లాభాలు అదుర్స్‌.. 22.70 శాతం పెరిగిన ఆదాయం

న్యూఢిల్లి : దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ షేర్లు రాణించాయి. కంపెనీ లాభాలు టీసీఎస్‌ను మించి ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో.. ఎన్‌ఎస్‌ఈలో షేర్‌ ధర రూ.9.55 (0.55 శాతం) లాభపడి.. రూ.1,751 వద్ద ముగిసింది. రోజంతా రూ.1,732-రూ.1,759.49 మధ్యే కదలాడింది. క్యు4లో రూ.5,686 కోట్ల నికర లాభాన్ని గడించినట్టు కంపెనీ ప్రకటించింది. గతేడాది నాల్గో త్రైమాసికంతో పోలిస్తే.. 12 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఇక ఆదాయం పరంగానూ ఇన్ఫోసిస్‌ మెరుగైన వృద్ధినే సాధించింది. 22.7 శాతం వృద్ధి నమోదు చేసుకున్నట్టు కంపెనీ వివరించింది. గతేడాది నాల్గో త్రైమాసికంలో రూ.26,311 కోట్లు ఆర్జించగా.. 2021-22 ఆర్థిక సంవత్సరం క్యు4లో రూ.32,276 కోట్లు తన ఖాతాలో వేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. అదేవిధంగా డివిడెంట్‌ విషయంలోనూ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కీలక ప్రకటన చేసింది. ఒక్కో షేర్‌కు రూ.16 చొప్పున డివెండ్‌కు బోర్డు ఆమోదించినట్టు కంపెనీ ప్రకటించింది. అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య కాలంలో ఆదాయం రూ.31,897 కోట్లుగా ఉండింది.

డిజిటల్‌ రంగం మరింత వృద్ధి..

2021-22 ఆర్థిక సంవత్సరంలో.. డిజిటల్‌ రంగాన్ని మరింత విస్తరింపజేసినట్టు కంపెనీ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. గ్లోబల్‌ బిజినెస్‌లో వృద్ధిసాధించామని, కీలక ఒప్పందాలు చేసుకున్నామని వివరించారు. అదేవిధంగా క్లౌడ్‌ సర్వీసుల పరంగా కూడా భారీ లాభాలు గడించినట్టు తెలిపారు. 12 శాతం నికర లాభాల్లో ఈ రంగాలు కీలకంగా వ్యవహరించాయన్నారు. నాల్గో త్రైమాసిక కాలంలో భారీ రిక్రూట్‌మెంట్‌ చేపట్టామని తెలిపారు. క్యు4 కొత్తగా 22 వేల మందిని రిక్రూట్‌ చేసుకున్నామని, దీంతో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 3,14,015కు చేరుకుందని వివరించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో.. మొత్తంగా 85వేల మంది కొత్త వారికి ఇన్ఫోసిస్‌ కుటుంబంలో చేర్చుకున్నట్టు స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా భారీ రిక్రూట్‌మెంట్‌ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మరో 50వేల మందిని ఫ్రెషర్స్‌ను తీసుకునేందుకు కంపెనీ సిద్ధంగా ఉందన్నారు. ఏప్రిల్‌ నుంచి వేతనాలు పెంచుతున్నట్టు ఈ సందర్భంగా పరేఖ్‌ ప్రకటించారు.

దశాబ్ద కాలంలోనే అత్యధిక వార్షిక వృద్ధి..

ఇన్ఫోసిస్‌ కంపెనీ.. ఒక దశాబ్దకాలంలోనే.. అత్యధిక వార్షిక వృద్ధిని అందించిందని కంపెనీ ఎండీ సలీల్‌ పరేఖ్‌ ప్రకటించారు. లోతైన విభిన్నమైన, డిజిటల్‌, ఇన్ఫోసిస్‌ కోబాల్‌ ్ట నేతృత్వంలోని క్లౌడ్‌ సామర్థ్యాలతో విస్తృత ఆధారిత పనితీరు కనబర్చినట్టు వివరించారు. క్లయింట్ల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా.. సరైన రీతిలో సేవలు అందించామని, మార్కెట్‌ వాటాను మరింత పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా ముందడుగు వేశామని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కంపెనీ పరిస్థితులను పరేఖ్‌ వెల్లడించారు. సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగుతోందన్నారు. రష్యాకు అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ సంస్థలు తమ సేవలను నిలిపివేశాయని, తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. రష్యా నుంచి తమ కార్యకలాపాలు తరలిస్తున్నట్టు ప్రకటించారు. ఉక్రెయిన్‌లో ఘర్షణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్టు వివరించారు.

- Advertisement -

త్రైమాసిక ప్రాతిపదికన 1 శాతం వృద్ధి..

ఇన్ఫోసిస్‌ కంపెనీ ఆదాయం.. త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే.. 1 శాతం వృద్ధి సాధించింది. సప్లై సైడ్‌ ఛాలెంజ్‌లు అదేవిధంగా అధిక వీసా ఖర్చులు కంపెనీకి మార్జిన్‌లను తగ్గించాయి. పూర్తి సంవత్సర కాలానికి నికర లాభం రూ.22,110 కోట్లుగా నమోదైంది. ఇది కంపెనీ 2021 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన రూ.19,351 కోట్ల లాభం కంటే 14 శాతం వృద్ధి అని చెప్పొచ్చు. ఇటీవల ఫలితాలు వెల్లడించిన టీసీఎస్‌ 7.4 శాతం వృద్ధి రేటును నమోదు చేయగా.. ఇన్ఫోసిస్‌ 12 శాతం నమోదు చేయడం గమనార్హం. ఆదాయంలో చూసినప్పుడు.. టీసీఎస్‌ 15.75 శాతం (రూ.50,591 కోట్లు) వృద్ధిని నమోదు చేయగా.. ఇన్ఫోసిస్‌ 22.7 శాతం నమోదు చేయడం గమనార్హం. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో.. రష్యాలో ఇప్పటికే ఒరాకిల్‌ కార్పొరేషన్‌, ఎస్‌ఏపీ ఎస్‌ఈ వంటి మల్టి నేషనల్‌ కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement