– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
తెలంగాణలో ఇన్ఫ్లుఎంజా కేసులు స్వల్పంగా పెరిగాయని.. అయితే ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు వైద్యా, ఆరోగ్యమంత్రి హరీశ్‌రావు. ఫ్లూ కేసులను పరిశీలిస్తే వైరస్ ప్రభావం కనిపించడం లేదని అన్నారు. వారంరోజులుగా హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాలైన మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఔట్ పేషెంట్ల సంఖ్య స్వల్పంగా పెరిగిందన్నారు. అయినప్పటికీ ఇన్‌పేషెంట్ అడ్మిషన్లు, వెంటిలేటర్ సపోర్ట్ అవసరమయ్యే శ్వాసకోశ బాధతో వచ్చే రోగుల సంఖ్య పెద్దగా లేదన్నారు. అంతేకాకుండా ఔట్ పేషెంట్ వింగ్స్ లో చికిత్స పొందిన రోగులందరూ వారం నుండి 10రోజుల లోపు మందులు, తగిన విశ్రాంతి తీసుకోవడం ద్వారా కోలుకుంటున్నారని ఆయన చెప్పారు.
ఇన్ఫ్లుఎంజా అంటువ్యాధి కాబట్టి దగ్గు వచ్చినప్పుడు కొంత జాగ్రత్త తీసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ఉపయోగించడం వంటి ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. సమీక్షకు హాజరైన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ (డిపిహెచ్) డాక్టర్ జి శ్రీనివాసరావు, హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ తృతీయ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో సహా సీనియర్ ఆరోగ్య అధికారులు, ప్రజలు స్వీయ మందులు లేదా యాంటీబయాటిక్స్‌పై ఆధారపడాలని కోరారు. జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు వంటి ఫ్లూ లక్షణాలన్నీ విశ్రాంతి తీసుకోవడం.. సాధారణ మందులతో తగ్గుతాయని, ప్రత్యేకంగా డాక్టర్ చెబితే తప్ప యాంటీబయాటిక్స్ తీసుకోవలసిన అవసరం లేదని వారు చెప్పారు.