ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతూ పోతున్నది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రతీ నెల.. ద్రవ్యోల్బణం గరిష్టాలను నమోదు చేస్తున్నది. మార్చిలో నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణంతో పోల్చుకుని చూస్తే.. ఏప్రిల్‌లో ఇది మరింత పైపైకి చేరుకుంటున్నది. దీనికి సంబంధించిన లెక్కలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసింది. వ్యవసాయం, కార్మిక రంగాల్లో ఈ పెరుగుదల చోటు చేసుకున్నట్టు వెల్లడించింది. ఏప్రిల్‌లో వ్యవసాయం రంగంలో 6.44శాతం, గ్రామీణ కార్మిక రంగంలో 6.67 శాతం మేర పెరిగింది. ఇది వరకు వ్యవసాయంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతంగా, గ్రామీణ కార్మిక రంగంలో 6.33 శాతంగా ఉండేది. ఈ పెరుగుదల ఫలితంగా.. కన్జ్యూమర్ ఇండెక్స్ నంబర్‌ను కూడా సవరించాల్సి వచ్చింది. కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ 10 పాయింట్ల మేర పెంచింది. దీంతో వ్యవసాయానికి సంబంధించిన ఇండెక్స్ నంబర్ 1108, గ్రామీణ కార్మిక రంగం 1119 పాయిట్లకు పెరిగింది.
భారీగా పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
బియ్యం, జొన్నలు, సజ్జలు, రాగి, గోధుమ, కూరగాయలు, పండ్ల ధరలు భారీగా పెరగడంతో.. రిటౖౖెల్ ద్రవ్యోల్బణానికి దారితీసినట్టు ఆ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రాల వారీగా చూసుకుంటే.. వ్యవసాయ కార్మిక రంగంలో 19 రాష్ట్రాల్లో పెరుగుదల చోటు చేసుకుంది. ఇందులో 1 నుంచి 20 పాయింట్ల వరకు పెరుగుదల నమోదైంది. కేరళ గరిష్టంగా 20 పాయింట్లను రికార్డు చేసింది. గ్రామీణ కార్మిక కేటగిరిలో కేరళ, పశ్చిమ బెంగాల్ సంయుక్తంగా 19 పాయింట్లను అందుకున్నాయి. తమిళనాడులో మాత్రం ఏడు పాయింట్ల మేర తగ్గింది. సూచీల్లో తమిళనాడు 1275 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. 880 పాయింట్లతో హిమాచల్ ప్రదేశ్ చివరి స్థానంలో ఉంది. గత వారం విడుదల చేసిన రిటైల్ ద్రవ్యోల్బణం 8 ఏళ్ల గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో 7.79 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగిపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..