ఏప్రిల్ మాసంలో దేశంలో ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠానికి చేరుకున్నది. వినియోగదారుల సూచీ ఆధారంగా లెక్కించే రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతంగా నమోదైంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) మార్చిలో 1.9 శాతం పెరిగింది. గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గురువారం నాడు ఈ రెండు గణాంకాలను విడుదల చేసింది. మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.95 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణాన్ని 2 శాతం నుంచి 6 శాతం మధ్య నియంత్రించాలని ఆర్బీఐ గతంలో కేంద్రానికి నిర్దేశించింది. అయితే, గత నాలుగు నెలలుగా ద్రవ్యోల్బణం ఈ పరిమితిని మించే నమోదవుతున్నది. 2014 నుంచి నియంత్రణలోనే ద్రవ్యోల్బణం ఇటీవలి కాలంలోనే కట్టుతప్పింది. చమురు ధరలు, ఆహారపదార్థాల ధరలు పెరగడం వల్లనే ద్రవ్యోల్బణం ఇంతగా పెరిగిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆహార ద్రవ్యోల్బణంలో కూడా పెరుగుదల కనిపిస్తున్నది. గత నెలలో ఇది 7.68 శాతం ఉండగా ఏప్రిల్‌లో ఏకంగా 8.38 శాతానికి ఎగబాకింది. ఇటీవలి కాలంలో ఆహార ద్రవ్యోల్బణం ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి. కూరగాయలు, వంటనూనెల ధరలు అంతర్జాతీయంగా పెరగడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆర్బీఐ ఇటీవల రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచింది. అదేవిధంగా 22 ఏళ్లలో తొలిసారిగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ముందు ముందు వడ్డీ రేట్లు పెంచే అవకాశం లేకపోలేదని సెంట్రల్ బ్యాంక్స్ ఇప్పటికే ప్రకటించాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి