Friday, November 22, 2024

INDvsWI | గెలిచినట్లే గెలిచి.. ఓడిన భారత్

వెస్టిండీస్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో టీమిండియా ఖాతాలో మరో ఓటమి జమ అయ్యింది. ఆదివారం జరిగిన రెండో టి20లో భారత్ పై 2 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. 153 పరుగుల లక్ష్యాన్ని విండీస్ జట్టు 18.5 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి ఛేదించింది. నికోలస్ పూరన్ (40 బంతుల్లో 67; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. రోవ్ మన్ పావెల్ (21), హెట్ మైర్ (22) అతడికి చక్కటి సహకారం అందించారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు.. యుజువేంద్ర చహల్ 2 వికెట్లు సాధించినా మిగిలిన బౌలర్లు విఫలం అయ్యారు.

ఛేదనలో విండీస్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లను కోల్పోయింది. మొదటి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా తొలి బంతికే బ్రాండన్ కింగ్ (0)ను డకౌట్ చేశాడు. అదే ఓవర్ నాలుగో బంతికి చార్లెస్ ను పెవిలియన్ కు పంపాడు. అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ దంచి కొట్టాడు. కైల్ మేయర్స్ (15), పావెల్, హెట్ మైర్ లతో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. దాంతో విండీస్ 13.5 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లకు 126 పరుగులతో ఈజీగా గెలిచేలా కనిపించింది.

- Advertisement -

అయితే ఇక్కడే భారత్ కమ్ బ్యాక్ చేసింది. నికోలస్ పూరన్ తో పాటు మరో 3 వికెట్లను కేవలం 3 పరుగుల వ్యవధిలో సాధించింది. ఫలితంగా విండీస్ 126/4 నుంచి 129/8గా నిలిచింది. చహల్ వేసిన 16వ ఓవర్లో ఏకంగా 3 వికెట్లు లభించాయి. దాంతో భారత్ గెలిచేలా కనిపించింది. అయితే అకీల్ హుసేన్ (16 నాటౌట్), అల్జారీ జోసెఫ్ (10 నాటౌట్)లో పోరాడి విండీస్ ను గెలిపించారు. దాంతో భారత్ మరో ఓటమిని ఖాతాలో జమ చేసుకుంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. రెండో మ్యాచ్ ఆడుతున్న తిలక్ వర్మ జట్టును ఆదుకున్నాడు. కష్ట సాధ్యమైన పిచ్ పై ఎంతో పరిణతి చూపిస్తూ బ్యాటింగ్ చేశాడు. 41 బంతుల్లో 51 పరుగులు చేసి తన కెరీర్ లో తొలి అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ 5 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. ఇషాన్ కిషన్ (27) హార్దిక్ పాండ్యా (24) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో అకీల్ హుసేన్, అల్జారీ జోసెఫ్, రొమారియో షెపర్డ్ లు తలా రెండు వికెట్లు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement