Sunday, November 17, 2024

పరిశ్రమ ఫ్రెండ్లీ నైపుణ్య శిక్షణ.. భారీగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ చేపడుతున్న ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ప్రభుత్వం భారీగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం చేపడుతోంది. పెట్టుబడుదారుల అవసరాలకు అనుగుణంగా వర్క్‌ఫోర్స్‌ను తయారు చేస్తోంది. ఇందుకోసం ఇంజనీరింగ్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇతర వృత్తి విద్యాకోర్సులు చదివే విద్యార్థులకు వారు కోర్సులు చదివేటపుడే శిక్షణనిచ్చి కంపెనీల అవసరాలకు తగ్గట్లు సిద్ధం చేస్తోంది. ఇంతేకాక చదువు పూర్తయి ఉద్యోగాల కోసం వేచిచూస్తున్న ఉద్యోగార్థులకూ పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లుగా నైపుణ్య శిక్షణనిస్తోంది. ఇందుకు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని అమలు చేస్తోంది. రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌(టాస్క్‌) ఆధ్వర్యంలో వేలాది మంది శిక్షణ పొంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల యూనిట్లలో ఉద్యోగాలు పొందినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై కంపెనీల ప్రశంసలు…

రాష్ట్రంలో జరుగుతున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలపై ఇక్కడ పెట్టుబడి పెట్టి కార్యాలయాలు, యూనిట్లు నెలకొల్పిన కంపెనీలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇక్కడ విస్తతంగా అందుబాటులో ఉన్న నైపుణ్యం కలిగిన యువత వల్లే తాము పెట్టుబడులు పెట్టి సజావుగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించగలుగుతున్నామని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఇటీవల మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన ప్రముఖ రక్షణ రంగ ఉత్పత్తుల సంస్థ లాక్‌హిడ్‌ మార్టిన్‌ యాజమాన్య ప్రతినిధులు కూడా ఇదే విషయాన్ని ఆయనకు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన భారీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాల వల్లే తాము కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో పరిశ్రమ విజయవంతంగా నడుపగలుగుతున్నామని వారు మంత్రికి తెలిపారు. నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడంలో ప్రభుత్వ కృషి గొప్పదని లాక్‌హిడ్‌ మార్టిన్‌ ప్రతినిధులు కొనియాడారు. కేవలం ఈ కంపెనీయే కాకుండా గతంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ప్రముఖ దుస్తుల తయారీ కంపెనీ కిటెక్స్‌ కూడా రాష్ట్రంలో యువతకు ప్రభుత్వం ఇస్తున్న నైపుణ్య శిక్షణ వల్లే తమకు కావాల్సిన వర్క్‌ఫోర్స్‌ అతి తక్కువ కాలంలో లభించిందని తెలిపింది. కిటెక్స్‌ కంపెనీ తొలుత రూ.1000 కోట్ల పెట్టుబడిని ప్రకటించి తర్వాత ఆ పెట్టుబడిని రూ.2000 కోట్లకు పెంచిన విషయం తెలిసిందే.

ఈవోడీబీలో మరింత ముందంజ…

ఇప్పటికే టీఎస్‌ఐపాస్‌ లాంటి పురోగామ పాలసీలు, ఇక్కడి సరళతర వ్యాపార విధానాలకు ఆకర్షితులై రాష్ట్రంలో కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే నైపుణ్యం కలిగిన యువతను పారిశ్రామిక వేత్తలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌(ఈవోడీబీ) ర్యాంకుల్లో రాష్ట్రం మరింత ముందుకు వెళ్లేందుకు దోహదం చేయనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సిల్డ్‌ వర్క్‌ ఫోర్స్‌ లేకుండా పెట్టుబడులను ఆకర్షించడం అసాధ్యమని ఆ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement