విజయవాడ ఆంధ్రప్రభ – ప్రతిరోజు వేల సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వచ్చే ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో పారిశుధ్యం మెరుగుపడింది. గడిచిన కొన్ని నెలలుగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, భవాని దీక్షల విరమణ ఒంటి కార్యక్రమాలు నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై పారిశుద్ధ్యం కొరబడింది. కొత్తగా ఇన్చార్జి ఈవో బాధ్యతల స్వీకరించిన రామచంద్ర మోహన్ ఇంద్రకీలాద్రిపై అకస్మాత్తుగా పర్యటించిన సందర్భంలో ఎక్కడికక్కడ అపారిశుధ్యం తాండవించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విభాగానికి చెందిన అధికారులను పిలిపించి మందలించారు.
ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై గడిచిన మూడు రోజులుగా పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే దిశగా చర్యలు ప్రారంభించింది.
శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్…..
ఇంద్రకీలాద్రి కొండ పైన, క్రింద క్యూ లైన్ లు, ప్రధాన దేవాలయము, శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం ఉప ఆలయములు, అన్నదాన విభాగం, పార్కింగ్ ప్రదేశములు, ఘాట్ రోడ్, టాయిలెట్ లు, ఆఫీస్ లోని అన్ని విభాగములు, భక్తులు తిరుగు పలు ప్రదేశములలోను ఆలయ శానిటేషన్, ఇంజినీరింగ్ అధికారులు సిబ్బందితో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పారిశ్యుద్దం పూర్తి సంతృప్తికరముగా ఉండే విధంగా స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించారు.
ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టి పలు ప్రదేశములలో ఉన్న పాత, వ్రేలాడుచున్న, నిరూపయోగమైన వైర్లు, ఉపయోగంలో లేని వస్తువులు, చెత్త తొలగించడం, టాయిలెట్ల మరమ్మత్తులు తదితర చర్యలు చేపట్టారు. దీంతో ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై కాస్త ఆహ్లాదకర, మంచి వాతావరణం కనిపిస్తుంది.