ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 ఈవెంట్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలొచ్చాయి. శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో స్టార్ ఇండియన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ విజయం సాధించింది. కొరియాకు చెందిన మిన్ హ్యూక్ కాంగ్, సీయుంగ్ జే సియోలను ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో 17-21, 21-19, 21-18తో అన్‌సీడెడ్ కొరియా జోడీని ఓడించేందుకు ఏడో సీడ్ భారత జోడీ 67 నిమిషాల పాటు పోరాడాల్సి వచ్చింది. ఈ గెలుపుతో భారత జోడీ ఇప్పుడు కాంగ్ – సియో జంటపై 3-2 హెడ్ టు హెడ్ రికార్డు సాధించారు. ప్రపంచ ఆరో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్-చిరాగ్ తదుపరి మ్యాచ్‌లో ఇండోనేషియాకు చెందిన కుసుమవర్దన -యెరేమియా లేదా మలేషియాకు చెందిన ఆరోన్ చియా- వూయ్ యిక్ జోడీతో తలపడతారు.
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ పోరాటం ముగిసింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ ఓటమిపాలయ్యాడు. టాప్‌సీడ్, డానిష్ షట్లర్ విక్టర్ ఎక్సెల్‌సెన్‌పై వరుస సెట్లలో పరాజయం చెందాడు. కీలక పోరులో 15-21, 15-21 స్కోరుతో డానిష్ ప్లేయర్ పైచేయి సాధించాడు. కాగా ఎక్సెల్‌సెన్‌పై ప్రణయ్‌కిది ఆరవ ఓటమి. వీరిద్దరి ముఖాముఖిలో భారత ఆటగాడు కేవలం రెండు సార్లు మాత్రమే గెలుపొందాడు.