Tuesday, November 26, 2024

మోడీ పర్యటనతో ఇండో-యూస్‌ సంబంధాలకు సరికొత్త ఊతం..

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో చేపడుతున్న పర్యటన రక్షణ-పారిశ్రామిక సహకారంలో సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుందని, ద్వైపాక్షిక సంబంధాలను అత్యున్నత శిఖరాలకు చేర్చడంలో ఒక స్ప్రింగ్‌ బోర్డులా పనిచేస్తుందని అమెరికా అధికారులు అభిప్రాయపడ్డారు. భారత్‌తో సుదీర్ఘకాలంగా పటిష్టమైన దౌత్య సంబంధాలను నెరపుతున్నట్టు తెలిపారు. అధ్యక్షుడు జో బైడెన్‌ కేబినెట్‌లో కీలకమైన సభ్యుల్లో కొందరు ఇరుదేశాల సంబంధాలపై ఇటీవల కాలంలో అసాధారణమైన స్పష్టత, అత్యుత్సాహంతో మాట్లాడారు.

పాత చాదస్తాలను తోసిరాజని, అమెరికా బ్యూరోక్రసీలో ఇప్పటికీ కొనసాగుతున్న తాత్సారాన్ని అధిగమించడంలో తాము తీసుకున్న సరికొత్త చొరవలను వారు నొక్కి వక్కాణించారు. భారత్‌-పసిఫిక్‌ కోసం వైట్‌హౌస్‌ సమన్వయకర్త కుర్ట్‌ క్యాంప్‌బెల్‌ మాటల్లో చెప్పాలంటే ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింతగా పటిష్టపరచడంలో మోడీ పర్యటన ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ నెల మొదట్లో భారత్‌లో పర్యటించిన సందర్భంగా డిఫెన్స్‌ సెక్రటరీ లాయిడ్‌ ఆస్టిన్‌ మాట్లాడుతూ ఇరు దేశాలు ఒక రూపాంతీకరణ స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. ఇటీవల ఇరువైపుల నుంచి ఉన్నతాధికారుల రాకపోకలు అధికారుల స్థాయిలో చర్చలను వేగవంతం చేశాయి.

- Advertisement -

అజిత్‌ దోవల్‌తో ఆరంభం

ఇన్సియేటివ్‌ ఆన్‌ క్రిటికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీ(ఐసెట్‌)ను ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారులు అజిత్‌ దోవల్‌, జేక్‌ సల్లివేన్‌ ఈ ఏడాది మొదట్లో ఆరంభించారు. రక్షణ సహకారం నుంచి వ్యూహాత్మక వాణిజ్యం వరకు ఆయా రంగాల్లో ఒక సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్‌గా అవతరించిన ఐసెట్‌… అంతరిక్షం నుంచి విద్య వరకు వేర్వేరు రంగాల్లో సమన్వయంతో సప్లయ్‌ చైన్లను నిర్మించడానికి ఉపకరిస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

రష్యా, చైనాలపై భారత్‌ వైఖరి అత్యంత ఆసక్తికరం

తన అమెరికా పర్యటనలో భాగంగా హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌, సెనెట్‌ సభ్యులతో కూడిన కాంగ్రెస్‌ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మోడీ చేయనున్న ప్రసంగం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ సందర్భంగా రష్యా, చైనా దేశాల పట్ల భారత్‌ వైఖరి కోసం ప్రపంచ దేశాలు వేచి ఉన్నాయి. అయితే అమెరికా-చైనా బిజినెస్‌ కౌన్సిల్‌ ఇటీవల నిర్వహించిన ఐడియాస్‌ సదస్సులో యుక్రెయిన్‌ యుద్ధం పట్ల భారత్‌ వైఖరిని కీలకమైన సెనెటర్లు, భారత్‌కు చిరకాల మిత్రులు మార్క్‌ వార్నెర్‌, జాన్‌ కోర్నిన్‌ విమర్శించారు. నాన్చివేత ధోరణిని అనుసరిస్తున్నదని ఆరోపించారు. అయితే రష్యా ఆయుధాగారంపై భారత్‌ ఆధారపడే తత్వం, ఇరు దేశాల సంబంధాలకు 50 ఏళ్ళ చరిత్ర కారణంగా భారత్‌ వైఖరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదని కోర్నిన్‌ అన్నారు.

భారత్‌కు సమయం ఆసన్నమైంది

భారత్‌ పట్ల ప్రతికూలతలను ప్రధాని పట్టించుకోవాల్సి ఉందని వార్నర్‌ అన్నారు. న్యాయపాలన, మచ్చలేని రాజకీయ ప్రక్రియ, స్వేచ్ఛా పాత్రికేయం పట్ల ప్రధాని మోడీ ప్రసంగంలో నిబద్ధతను ఆయన చూడాలనుకుంటున్నారు. పాత్రికేయులపై కేసులు, లోక్‌సభ సభ్యుడిగా రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు, మైనార్టీలపై హింస లాంటి అంశాలపై భారత ప్రభుత్వ స్పందనలతో తాను ఇరకాటంలో పడ్డానని తెలిపారు. భారత్‌కు సమయం ఆసన్నమైందని వార్నర్‌ అన్నారు. చైనాకు దీటుగా సరిహద్దు వద్ద నిలబడిందంటూ భారత్‌ను కొనియాడారు.

జెట్‌ ఇంజిన్ల తయారీపై ఒప్పందం

ప్రధాని పర్యటన సందర్భంగా దేశానికి ఉపకరించే ఒప్పందాలను, భాగస్వామ్యాలను కుదుర్చుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. జనరల్‌ ఎలక్ట్రిక్‌(జీయీ) కంపెనీతో కలిసి భారత్‌లో జెట్‌ ఇంజిన్లను తయారు చేసే ఒప్పందం వాటిలో ఒకటి. అందులో భాగంగా జెట్‌ ఇంజిన్ల అసెంబ్లింగ్‌, విడిభాగాలు, సిస్టమ్స్‌ తరలింపు కూడా ఉంటాయి. ఆ క్రమంలో విడతలవారీగా టెక్నాలజీ బదలాయింపు 60 శాతానికి చేరుకుందని అధికార వర్గాలు తెలిపాయి.

చైనాకు ప్రత్యామ్నయం భారత్‌

మరో కీలకమైన, అంతే సమానమైన పరిణామం సెమీకండక్టర్ల రంగం రూపంలో రానుంది. సెమీకండక్టర్ల కోసం అసెంబ్లింగ్‌, టెస్టింగ్‌, ప్యాకేజింగ్‌కు అనుకూలమైన ఒక వాతావరణాన్ని సృష్టించడంలో సాయపడాల్సిందిగా యూఎస్‌ కంపెనీలకు భారత్‌ విజ్ఞప్తి చేసింది. చైనాకు ఒక ప్రత్యామ్నాయంగా భారత్‌ను చూసే విషయమై ఆలోచించాలని ప్రైవేట్‌ రంగానికి కాంగ్రెస్‌ సభ్యులు, అమెరికా ప్రభుత్వ అధికారులు విజ్ఞప్తి చేయడం విశేషం. గతంలో వారి వ్యవహారశైలి దీనికి పూర్తి భిన్నంగా ఉండేది. ప్రైవేట్‌ రంగానికి తాము ఎలాంటి విజ్ఞప్తులు చేయలేమని అప్పట్లో అనేవారు. ప్రస్తుతం చైనాకు తోడుగా ప్లాన్‌ బీ ఉండాలని ప్రైవేట్‌ రంగంలో దిగ్గజాలకు సూచిస్తున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

యోగాతో పర్యటన మొదలు

ఒక సత్‌ సంకల్పంతో ఇరు దేశాలు ముందడుగు వేస్తున్న నేపథ్యంలో జూన్‌ 21 నుంచి 24వరకు ప్రధాని ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి(ఐరాస) వద్ద అంతర్జాతీయ యోగ దినోత్సవంలో పాల్గొనడంతో ప్రధాని పర్యటన మొదలవుతుంది. అదేరోజున ఆయన వాషింగ్టన్‌ చేరుకుంటారు. వైట్‌ హాౌస్‌కు వచ్చే అతిథుల కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్‌గా పేరొందిన బ్లెయిర్‌ హౌస్‌లో బస చేస్తారు. విద్యా రంగంపై అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌తో ఒక కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. బైడెన్‌, ఆయన కుటుంబ సభ్యులతో వైట్‌ హౌస్‌లో ఒక ప్రైవేట్‌ డిన్నర్‌ చేయడంతో ప్రధాని మోడీ రోజును ముగిస్తారు. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఏకాంతంగా గడిపి అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే భద్రత దృష్ట్యా బ్లెయిర్‌ హౌస్‌ నుంచి వైట్‌ హౌస్‌కు ఆయన నడుచుకుంటూ వెళతారా లేక ఏదైనా వాహనంలో వెళతారా అనేది ఒక మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.

వైట్‌హౌస్‌లో స్వాగతంతో అధికారిక పర్యటన షురూ

అమెరికా దేశానికి అధికారిక పర్యటన జూన్‌ 22న మొదలవుతుంది. వైట్‌ హౌస్‌ పచ్చిక బయళ్ళపైన ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడి నుంచి గౌరవపూర్వకమైన స్వాగతం అందుకోవడంతో ప్రారంభమవుతుంది. మధ్యాహ్నానికి ఆయన క్యాపిటల్‌ హిల్‌ చేరుకుంటారు. హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌, సెనెట్‌ సభ్యులతో కూడిన కాంగ్రెస్‌ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాంటి అరుదైన గౌరవాన్ని అందుకున్న రెండవ పర్యాయం అందుకున్న ఏకైక భారత ప్రధానిగా మోడీ వాసికెక్కనున్నారు. సాయంత్రానికి ఆయన వైట్‌ హౌస్‌కు చేరుకుంటారు. అమెరికన్లకు, భారతీయులకు ప్రాతినిధ్యం వహించే దాదాపు 250 మంది అతిథులు పాల్గొనే అమెరికా ప్రభుత్వపు డిన్నర్‌కు హాజరవుతారు.

కమలా హ్యారీస్‌తో లంచ్‌.. భారతీయులనుద్దేశించి ప్రసంగం

అధికారిక పర్యటన ముగిసిన అనంతరం జూన్‌ 23న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌, స్టేట్‌ సెక్రటరీ ఆంటోని బ్లింకె ఆతిథ్యమిచ్చే మధ్యాహ్న విందుకు ప్రధాని మోడీ హాజరవుతారు. దీనితో పాటుగా భారతీయులను ఉద్దేశించి ప్రసంగించే రెండు సభల్లో ఒకటి ప్రతిష్ఠాత్మక కెనడీ సెంటర్‌లో జరుగనుంది. కాపిటల్‌ హిల్‌ వద్ద, వైట్‌ హౌస్‌ వద్ద మోడీని అభినందించే నిమిత్తం పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు వాషింగ్టన్‌ నుంచి వస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement