Sunday, November 24, 2024

భారత్‌-పాక మధ్య అణు జాబితా మార్పిడి..

ఇటీవల సంవత్సరాల్లో ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, దాయాది దేశాలు మూడు దశాబ్దాల సంప్రదాయాన్ని కొనసాగించాయి. శత్రు సమయంలో దాడిచేయలేని అణు సంస్థాపనల జాబితాను ఇండియా- పాక్‌ శనివారం పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నాయి. అదేవిధం గా జైళ్లలో ఉన్న ఖైదీల వివరాల జాబితాను కూడా మార్పిడి చేసుకున్నాయి. పౌర ఖైదీలు, తప్పి పోయిన రక్షణ సిబ్బంది, మత్స్యకారులను త్వరగా విడుదల చేయాలని పొరుగు దేశాన్ని భారత్‌ కోరింది. అణుసంస్థాపనలు, సౌకర్యాలపై దాడి నిషేధం ఒప్పందంలోని నిబంధనల ప్రకారం జాబితాలు ఇచ్చిపుచ్చుకున్నామని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. జాబితా మార్పిడి జరగడం ఇది వరసగా 31వసారి. ఇరుదేశాలు 1988 డిసెంబర్‌ 31న ఈ ఒప్పందం పై సంతకాలు చేశాయి. 1991 జనవరి 27 నుంచి అమల్లోకి వచ్చింది. 1992 నుంచి ప్రతి ఏటా జనవరి 1, జులై 1న ఈ ఒప్పందం కింద పొందుపరచ బడిన అణు సంస్థాపనల గురించి ఒకరికొకరు తెలియపరచు కోవాల్సి ఉంటుంది. తాజా జాబితాలోని వివరాల ప్రకారం, భారత దేశంలో ప్రస్తుతం 282 మంది పాక్‌ పౌర ఖైదీలు, 73 మంది మత్స్యకారులు ఉన్నారు. పాకిస్తాన్‌ నిర్బంధంలో 51 మంది భారత పౌర ఖైదీలు, 577 మంది మత్స్యకారులు ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఇద్దరు పౌర ఖైదీలు, 256 మంది మత్స్యకారుల విడుదలను వేగవంతం చేయాలని భారత్‌ కోరింది. వీరి జాతీయత ఇప్పటికే నిర్దారించబడిందని పాక్‌కు తెలియజేసినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. కాగా 182 మంది మత్స్యకారులు, 17 పౌర ఖైదీలకు తక్షణమే కాన్సులర్‌ యాక్సెస్‌ను అందించాలని విజ్ఞప్తి చేశామని తెలిపింది. మరోవైపు వైద్య నిపుణుల బృందం సభ్యులకు వీసాలు మంజూరు వేగవంతం చేయాలని, వివిధ జైళ్లలో ఖైదీలుగా ఉన్న భారతీయుల మానసిక స్థితిని అంచనా వేయడానికి వీలుగా వారికి పాకిస్తాన్‌ పర్యటనను సులభతరం చేయాలని భారత్‌ కోరడం జరిగింది. 2008 మే 21న నాటి ఒప్పందంలోని కాన్సులర్‌ యాక్సెస్‌ నిబంధనల ప్రకారం ఇరుపక్షాల న్యాయ నిపుణులతో కూడిన యంత్రాంగాన్ని ప్రస్తావిస్తూ, పాకిస్తాన్‌లో జాయింట్‌ జ్యుడిషియల్‌ కమిటీ ముందస్తు పర్యటనను నిర్వహించాలని కూడా ప్రతిపాదించ బడినట్లు తాజా ప్రకటన వెల్లడించింది. కొవిడ్‌-19 మహమ్మారి దృష్ట్యా పౌర ఖైదీలు, మత్స్యకారులందరి భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించాలని పాకిస్తాన్‌కు సూచించామని తెలిపింది. బందీలుగా ఉన్నవారి అంశాలతో సహా అన్ని మానవతా విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి భారత్‌ కట్టుబడివుందని పొరుగుదేశానికి సూచించామని విదేశాంగ శాఖ స్పష్టంచేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement