ఇందిరాదేవి మృతిపట్ల సీనియర్‌హీరో బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆమె మరణం బాధాకరమని అన్నారు. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారని. కృష్ణ, మహేశ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇందిరాదేవి తుదిశ్వాస విడిచారనే విషయం విచారం కలిగించిందని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత కొంతకాలంగా వయోసంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇందిరాదేవి బుధవారం ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె అంతిమ సంస్కారాలను హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ఇవాళ మధ్యాహ్నం నిర్వహించనున్నారు.
కాగా, ఇందిరాదేవి భౌతికకాయానికి ప్రముఖ నిర్మాత అశ్వినీదత్, దర్శకులు కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, రామకృష్ణ, హీరో వెంకటేశ్, జీవిత, రాజశేఖర్, బండ్ల గణేశ్ నివాళులర్పించారు. ఇందిరాదేవి భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, మహేశ్ బాబు అభిమానులు తరలివస్తున్నారు. కాగా ఆమె పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం పద్మాలయా స్టూడియోస్ కు తరలించారు. మధ్యాహ్నం వరకు ఆమె పార్థివదేహం అక్కడే ఉంటుంది. అనంతరం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహిస్తారు. ఇందిరాదేవి గత కొంత కాలంగా వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందారు.