దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఏఐ చాట్‌బాట్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. టికెట్ల బుకింగ్ సహా కస్టమర్లు అడిగే ప్రశ్నలకు ఈ చాట్‌బాట్ పది భాషల్లో సమాధనం ఇస్తుంది. ఇండిగో దీన్ని 6 ఎస్కై పేరుతో తీసుకు వచ్చింది. ఈ ఏఐ చాట్‌బాట్ హిందీతో పాటు, ప్రాంతీయ భాషలైన తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో సమాధానాలు ఇస్తుంది. మైక్రోసాఫ్ట్‌తో కలిసి ఇండిగో డిజిటల్ టీమ్ ఈ కొత్త ఏఐ చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసింది.
జీపీటీ-4 టెక్నాలజీని ఇందులో వినియోగించారు. ఈ చాట్‌బాట్ వల్ల కస్టమర్ సర్వీస్ ఏజెంట్లపై 75 శాతం వరకు పనిభారం తగ్గుతుందని ఇండిగో తెలిపింది. కస్టమర్లు తరచుగా అడిగే అనేక ప్రశ్నలకు ఈ చాట్‌బాట్ సమాధానం ఇస్తుంది. విమాన టికెట్ బుకింగ్, వెబ్‌చెక్-ఇన్, సీట్ సెలక్షన్, ఇటిర్నరీ డౌన్‌లోడ్, జర్నీ లేదా ట్రిప్ ప్లానింగ్ వంటి సేవలను ఈ ఏఐ చాట్‌బాట్ అందిస్తుంది.
డిస్కౌంట్ కూపన్ల వినియోగంలోనూ ఏఐ చాట్‌బాట్ సహాయపడుతుంది. టెక్ట్స్ మాత్రమే కాకుండా స్పీచ్ ఆప్షన్ ద్వారా మనం ఇచ్చే కమాండ్లకు టెక్ట్స్ రూపంలో ఈ ఏఐ చాట్‌బాట్ సమాధానం ఇస్తుంది. కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడం కోసం దీన్ని ప్రారంభించామని దీని వల్ల బుకింగ్ ప్రక్రియ మరింత సరళతరం కానుందని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.
కేవలం యూజర్ల ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే కాకుండా సంభాషణల మధ్యలో మనిషిలానే భావోద్వేగాలను కూడా ఈ ఏఐ చాట్‌బాట్ జోడిస్తుందని తెలిపింది. ఈ సేవల పట్ల వినియోగదారులు సంతృప్తి చెందుతారని భావావిస్తున్నట్లు తెలిపింది. దీని వల్ల తమ నిర్వహణ సామర్ధ్యం కూడా మెరుగుపడుతుందని ఇండిగో తెలిపింది.