దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. రెండు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట వేస్తూ ముందుకే దూసుకెళ్లాయి. ప్రారంభంలో ఫ్లాట్‌గా మొదలైన సూచీలు కొద్దిసేపటికే కోలుకుని లాభాల్లోకి ఎగబాకాయి. ఆ తర్వాత ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. ఉదయం సెన్సెక్స్ 61,405 వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 61,844 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 468 పాయింట్లు లాభపడి 61806 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18,288 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించి ఇంట్రాడేలో 18,431-18,244 మధ్య కదలాడింది. చివరకు 151 పాయింట్ల లాభంతో 18,420వద్ద ముగిసింది. గతవారం జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో ప్రతికూల సంకేతాలు లేకపోవడం, కొన్ని అంశాలపై స్పష్టత రావడం సూచీలకు కలిసొచ్చింది. మరోవైపు ప్రత్యక్ష పన్ను వసూళ్లు క్రితం ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరగడం కూడా మార్కెట్లకు మద్దతుగా నిలిచింది. మరోవైపు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు, ఐరోపా సూచీలు కూడా సానుకూలంగా కదలాడటం మన మార్కెట్లకు పాజిటివ్‌గా మారింది.
అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్‌సర్వ్, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బ్రిటానియా, హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1 శాతం వరకు నష్టపోయాయి. నిప్టీn మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం పెరిగాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.61 వద్ద నిలిచింది.