Wednesday, November 20, 2024

సెనెగల్ అభివృద్ధిలో భారత్ విశ్వసనీయ భాగస్వామి : వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సెనెగల్ సర్వతోముఖాభివృద్ధిలో భారతదేశం మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా సెనెగల్ రాజధాని డకార్‌కు చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేతృత్వంలోని భారత బృందానికి ఆ దేశ విదేశాంగ మంత్రి శ్రీమతి ఐసాటా తాల్ సాల్ స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు 60 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో మొదటిసారి ఉన్నతస్థాయి భారతబృందం సెనెగల్‌లో పర్యటించింది. డకార్‌లో సెనెగల్ అధ్యక్షుడు మెకీ సాల్‌తో ఉపరాష్ట్రపతి ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి, యువత సంబంధిత అంశాల్లో సహకారం, దౌత్యవేత్తలు, అధికారులకు వీసా-ఫ్రీ రిజైమ్ అంశాల్లో ఒప్పందాలు జరిగాయి. తద్వారా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేందుకు వీలుంటుందని ఇరుదేశాల ప్రతినిధులు ఆకాంక్షించారు. భారత్ తరఫున కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, సెనెగల్ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి ఐసాటా తాల్ సాల్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆఫ్రికా ఖండంలో ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యంగా సెనెగల్ సాధిస్తున్న ప్రగతిని ప్రశంసించారు. కరోనా నేపథ్యంలోనూ భారత్-సెనెగల్ దేశాల మధ్య వాణిజ్యం 37శాతం పెరిగి 1.5 బిలియన్ అమెరికన్ డాలర్లుగా నమోదవడం అభినందనీయమన్నారు. వ్యవసాయం, ఆయిల్ అండ్ గ్యాస్, వైద్యం, రైల్వేలు, గనులు, రక్షణ, హరిత శక్తి తదితర అంశాల్లో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని వెంకయ్య ఆకాంక్షించారు. సుష్మాస్వరాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీసెస్, సెనెగల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మధ్యలో 2021లో జరిగిన ఒప్పందం ద్వారా ప్రతి ఏటా 15 మంది సెనెగల్ దౌత్యవేత్తలకు శిక్షణ ప్రారంభించనున్న విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. మాదక ద్రవ్యాల అక్రమరవాణా కేసులో సెనెగల్ అధికారులకు పట్టుబడి ఇక్కడ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న నలుగురు భారతీయులను వదిలిపెట్టాలని చర్చల సమయంలో ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. ఈ కేసును వేగవంతంగా విచారించి ఆ నలుగురు భారతీయులను వదిలిపెట్టాలని కోరారు. ఈ నలుగురి కోసం వారి కుటుంబసభ్యులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని మానవతా దృక్పథంతో ఆలోచించాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement