2023-24 ఆర్ధిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు 6.6 శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 2022-23లో ఇది 6.9 శాతం ఉంటుందని బ్యాంక్ పేర్కొంది. 2023లో ప్రపంచ ఆర్ధిక వృద్ధిరేటు భారీగా పతనం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇది మూడు దశాబ్దాల దిగువకు నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొం ది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మాంద్యంలోకి జారే ప్రమాదం ఉందని తెలిపింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు పెంపు, ఆర్ధిక ఒత్తిడి, ప్రధాన ఆర్ధిక వ్యవస్థలు వృద్ధిరేటు భారీగా తగ్గడం, పెరుగుతున్న భౌళిక రాజకీయ ఉద్రికత్తలు వంటి కారణాల వల్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 80 సంవత్సరాల తరువాత మొదటిసారిగా ఒకే దశాబ్దంలో ప్రపంచ ఆర్ధిక మాంద్యాలు ఎదుర్కోనున్నట్లు తెలిపింది.
ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేటు 2023లో 1.7 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఐరోపా ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేటు జీరోగానూ, అమెరికా ఆర్ధిక వ్యవస్థల వృద్ధిరేటు 0.5 శాతంగా ఉంటుందని తెలిపింది. చైనా వృద్ధిరేటు 4.3 శాతం ఉంటుందని స్పష్టం చేసింది. కొవిడ్ ఆంక్షలు చైనా ఎత్తివేస్తే వినియోగం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 1970 తరువాత మొదటిసారి చైనా ఆర్ధిక వృద్ధిరేటు అతి తక్కువగా 2.7 శాతం మాత్రమే ఉందని పేర్కొంది.
ప్రపంచ ఆర్ధిక మందగమనం ప్రభావం ఇండియాపై కూడా ఉంటుందని తెలిపింది. పెట్టుబడులు తగ్గుతాయని, ఎగుమతులపై ప్రభావం పడుతుందని అంచనా వేసింది. భారత ప్రభుత్వం మౌలిక సదుపాయలపై పెట్టుబడులు పెంచుతున్నదని, మరో వైపు ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతున్నాయని తెలిపింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల మూలంగా ఇండియా వృద్ధిరేటు మందగిస్తుందని, ఇది 6.6గా ఉంటుందని తెలిపింది. మన దేశ గణాంక కార్యాలయం మాత్రం 2023లో మన దేశ వృద్ధిరేటు 7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.