Tuesday, November 19, 2024

ఐదో టెస్టులో ఇండియా ఓటమి…టెస్ట్ సిరీస్ 2-2తో డ్రా

ఇంగ్లండ్‌ Vs భారత్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. నాలుగో రోజు ఆటలోనే ఆధిపత్యం ప్రదర్శించిన జో రూట్, జానీ బెయిర్‌స్టో ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. ఐదో రోజు ఆట మొదలైనప్పటి నుంచే రూట్ (142 నాటౌట్), బెయిర్‌స్టో (114 నాటౌట్) దంచి కొట్టారు. ఎడాపెడా బౌండరీలతో ఇద్దరూ చెలరేగడంతో భారత బౌలర్లు చేతులెత్తేశారు. ఈ క్రమంలోనే చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ జట్టు 377 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి, 7 వికెట్లతో విజయం నమోదు చేసింది.

దీంతో ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమమైంది. 2007 తర్వాత ఇంగ్లండ్‌లో సిరీస్ గెలవాలన్న భారత కల కలగానే మిగిలిపోయింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ (146), జడేజా (104) రాణించడంతో భారత జట్టు 416 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెట్టిన బౌలర్లు 284 పరుగులకు ఆలౌట్ చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో తీవ్రంగా తడబడిన భారత బ్యాటింగ్ లైనప్ 245 పరుగులకు చేతులెత్తేసింది. ఈ క్రమంలో 378 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు 76.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, రికార్డు సృష్టించింది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ ఓపెనర్ల దూకుడును అడ్డుకుని మూడు వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లను రూట్, బెయిర్ స్టో సమర్థంగా ఎదుర్కొన్నారు. మరో వికెట్ పడకుండా నాలుగో రోజు ఆట ముగించిన ఈ జోడీ, ఐదో రోజు వేగంగా పనిపూర్తిచేసింది. దాంతో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement