Tuesday, November 19, 2024

ఆరు నెలల్లో కాస్మోటిక్స్‌పై 5,000 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్స్‌

దేశంలో కాస్మోటిక్స్‌పై పెడుతున్న ఖర్చు భారీగా పెరుగుతున్నది. 2023లో మొదటి ఆరు నెలల కాలంలో 10 ప్రధాన నగరాల్లో 10 కోట్లకు పైగా లిప్‌స్టిక్స్‌, నెయిల్‌ పాలీష్‌, ఐ లైనర్స్‌ వంటి కాస్మోటిక్స్‌ విక్రయాలు జరిగాయి. దేశంలో మొదటిసారిగా ఈ రంగంపై కాంటార్‌ వరల్డ్‌ ప్యానెల్‌ స్టడీ చేసి, నివేదిక విడుదల చేసింది. ఈ పది నగరాల్లో కాస్మోటిక్స్‌ కోసం కస్టమర్లు 5,000 కోట్లు ఖర్చు చేశారని ఈ నివేదిక తెలిపింది. ఇందులో 40 శాతం ఉత్పత్తులు ఆన్‌లైన్‌లోనే వీరు కొనుగోలు చేశారు.

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వీటిని కొనుగోలు చేసిన వారిలో ఎక్కువ మంది వర్కింగ్‌ ఉమెన్స్‌ ఎక్కువగా ఉన్నారు. ఇందులో లిప్‌స్టిక్స్‌ అమ్మకాలు 48 శాతం వరకు ఉన్నాయని తెలిపింది. అమ్మకాల్లో 36 శాతం రిటైల్‌ స్టోర్స్‌ నుంచి జరిగాయి. 31 మిలియన్ల లిప్‌స్టిక్స్‌, 26 మిలియన్ల నెయిల్‌ పాలిష్‌, 23 మిలియన్ల ఐ లైనర్స్‌, 22 మిలియన్ల ఫేస్‌ ఫ్యాక్స్‌, క్రీమ్స్‌ ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. కాస్మోటిక్స్‌ కొనుగోలుకు ఇండియన్స్‌ నెలకు సరాసరిగా 1,214 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. బ్యూటి ప్రొడక్ట్స్‌లో ఎక్కువగా లిప్‌స్టిక్స్‌కే డిమాండ్‌ అధికంగా ఉంది. దీని తరువాత నెయిల్‌ పాలిస్‌ను అత్యధికంగా కొనుగోలు చేస్తున్నారు.

ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేసే సమయం కంటే బ్యూటీ ప్రొడక్టుల కొనుగోలు కోసం మహిళలు సగటున 1.6 శాతం ఎక్కువ టైమ్‌ కేటాయిస్తున్నారు. ప్రముఖ రిటైల్‌ సంస్థ షాపర్స్‌టాప్‌ కూడా ఈ త్రైమాసికంలో బ్యూటీ ఉత్పత్తులు మేకోవర్స్‌ 1,50,000 విక్రయాలు జరిగినట్లు తెలిపింది. మార్కెట్‌లో బ్యూటీ ఉత్పత్తులకు డిమాండ్‌ భారీగా పెరుగుతున్నదని పేర్కొంది. ప్రధానంగా మేకప్‌ ఉత్పత్తులపై కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా యువ కస్టమర్లు వీటి పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్‌ మీడియా ప్రభావంతో వీరు ఉత్పత్తులను ఎంపిక చేసుకుంటున్నారు. రిటైల్‌ స్టోర్స్‌ అమ్మకాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. యువతులు ఎక్కువగా మేకప్‌ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు.

పెద్ద వయస్సు మహిళలు ఎక్కువగా లిప్‌స్టిక్స్‌, నెయిల్‌ పాలిష్‌ కొనుగోలు చేస్తున్నారు. యువతులు ప్రీమియం లిప్‌ బామ్స్‌ కొనుగోలు చేస్తున్నారు. ఇండియన్‌ బ్యూటీ ఇండస్ట్రీ వేగంగా వృద్ధి చెందుతున్నదని రెనీ కాస్మోటిక్స్‌ వ్యవస్థాపకుడు అశుతోష్‌ వలానీ చెప్పారు. ఇండియన్స్‌ సాంప్రదాయ కాజల్‌, లిప్‌స్టిక్‌ వంటి వాటి బదులు ప్రైమర్‌లు, ఐ షాడోలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం యువతులు రోజువారి ధరించే దుస్తుల రంగులకు అనుగుణమైన బ్యూటీ ఉత్పత్తుల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలో అంతర్జాతీయ కంపెనీలకు చెందిన ప్రీమియం బ్యూటీ ఉత్పత్తులు లభిస్తున్నాయి. ఎక్కువ మంది సందర్భాలకు అనుగుణంగా బ్యూటీ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ఎక్కువగా బ్యూటీ ఉత్పత్తులను పట్టణ ప్రాంతాల వారే అత్యధికంగా వినియోగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement