బర్మింగ్‌హామ్: బిఐఎస్ వరల్డ్ గేమ్స్-2023లో భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన టీ20 ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 9 వికెట్లతో చిత్తుచేసి స్వర్ణ పతకం గెలిచింది. వర్షం అంతరాయం కలిగించిన తుదిపోరులో డక్‌వర్త్ లూయిస్ (డిఎల్‌ఎస్) పద్దతిని భారత జట్టు విజేతగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, భారత బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 114పరుగులు మాత్రమే చేసింది.
వర్షం కారణంగా డీఎల్‌ఎస్ విధానంలో నిర్దేశించిన 42 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళలు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 3.3 ఓవర్లలో ఛేదించారు. ప్రపంచ క్రీడల్లో అంధుల మహిళల క్రికెట్ తొలి ఎడిషన్‌లో భారత్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. టోర్నీలో అన్ని మ్యాచ్‌లు గెలిచిన భారత మహిళల అంధుల జట్టు అజేయంగా నిలిచింది. ప్రారంభంలో ఆస్ట్రేలియాను 8 వికెట్లతో ఓడించి సత్తా చాటిన భారత్, ఆ తర్వాత ఇంగ్లండ్‌ను 185 పరుగుల తేడాతో చిత్తుచిత్తు చేసింది. బుధవారం జరిగిన మూడవ మ్యాచ్‌లో విజయపరంపరను కొనసాగించింది.