Wednesday, November 20, 2024

టీకాల ఎగుమతిపై భారత్ నిషేధం వల్ల 91 దేశాలపై ప్రభావం

కరోనా వ్యాక్సిన్ల ఎగుమ‌తిపై భార‌త్ నిషేధం విధించడం వ‌ల్ల సుమారు 91 దేశాలు కొత్త క‌రోనా వేరియంట్ల‌తో ఇబ్బందిప‌డుతున్నట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథ‌న్ తెలిపారు. పుణెలోని సీరం సంస్థ‌తో పాటు ఆస్ట్రాజెనికా కంపెనీలు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు ఒప్పందం ప్ర‌కారం వ్యాక్సిన్లు స‌ర‌ఫ‌రా చేయాలి. అతి పేద ఆఫ్రికా దేశాల‌కు ఆ టీకాల‌ను అందించాల్సి ఉంది. కానీ భార‌త్ నుంచి వ్యాక్సిన్ల ఎగుమ‌తి లేక‌పోవ‌డం వ‌ల్ల 91 దేశాలు టీకాల కోసం ఎదురుచూస్తున్నాయ‌ని ఆమె వెల్లడించారు.

B.1.617.2 వేరియంట్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో పేద ఆఫ్రికా దేశాల ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా ఉంద‌ని సౌమ్య స్వామినాథన్ తెలిపారు. కొత్త కొత్త వేరియంట్ల అతి వేగంగా విస్త‌రిస్తున్న కార‌ణంగా ప‌రిస్థితులు అదుపు త‌ప్పే ప్ర‌మాదం ఉంద‌న్నారు. WHOలోని గ‌వి ఒప్పందం ప్ర‌కారం పేద దేశాల‌కు ఆస్ట్రాజెనికా, సీరం సంస్థ‌లు సుమారు వంద కోట్ల టీకాల‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని, 2020లోనే ఆ సంఖ్య 40 కోట్లు ఉండాల‌ని, కానీ అలా జ‌ర‌గ‌డం లేద‌న్నారు. ఆఫ్రికా దేశాల్లో కేవ‌లం 0.5 శాతం మంది మాత్ర‌మే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు స్వామినాథ‌న్ తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీలో అస‌మాన‌త‌లు ఇలాగే ఉంటే.. పేద దేశాలు మ‌రింత ప్ర‌భావానికి లోన‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆమె చెప్పారు. వాస్త‌వానికి వ్యాక్సిన్ల‌కు అనుమ‌తి రాక‌ముందే అమెరికా, బ్రిట‌న్‌, కెన‌డా, ఇజ్రాయిల్‌, ఈయూ దేశాలు ఆర్డ‌ర్లు చేశాయి. గ‌త ఏడాది ఆగ‌స్టు నాటికే 15 కోట్ల డోసుల‌కు యూకే ఆర్డ‌ర్ ఇచ్చింది. క‌నీసం ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు అయినా వ్యాక్సిన్ల ఎగుమ‌తికి భార‌త్ అనుమ‌తి ఇస్తుంద‌ని భావిస్తున్న‌ట్లు సౌమ్య తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement