Saturday, November 23, 2024

అమెరికాకు 19 శాతం పెరిగిన భారత విద్యార్ధులు

మన దేశం నుంచి అమెరికాకు ఉన్నత విద్య కోసం వెళుతున్న విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021-22 సంవత్సరంలో మన దేశం నుంచి ఇలా వెళ్లి అమెరికా యూనివర్శిటీల్లో చేరుతున్న వారి సంఖ్య 19 శాతం పెరిగింది. 1,99,182 మంది విద్యార్ధులు ఇలా అమెరికాకు ఉన్నత విద్య కోసం వెళ్లారు. 2020-21లో 1,67,582 మంది విద్యార్ధులు అమెరికాలో చదువుకునేందుకు వెళ్లారని ఓపెన్‌ డోర్స్‌ అనే సంస్థ ఒక నివేదికలో తెలిపింది. 2012-13 సంవత్సరంలో మన దేశం నుంచి 96,654 మంది విద్యార్ధులు అమెరికా వెళ్లారు.

మన దేశం నుంచి అమెరికా వెళ్తుతున్న విద్యార్ధుల సంఖ్య 2022-23లో చైనాను మించిపోవచ్చని నివేదిక అంచనా వేసింది. ఈ జూన్‌-ఆగస్టు మద్యలో 82 వేల మంది మన దేశ విద్యార్ధులకు అమెరికా వీసాలు జారీ అయ్యాయి. ఈ కాలంలో ఏ దేశం కంటే ఎక్కువగా మన దేశ విద్యార్ధులే అత్యధికంగా అమెరికా వీసాలు పొందారు. గత సంవత్సరం ఇదే కాలంలో 62 వేల మంది భారతీయ విద్యార్ధులకు వీసాలు జారీ చేసినట్లు న్యూఢిల్లిలోని అమెరికా ఎంబసీ కౌన్సిలర్‌ వ్యవహారాల అధికారి డాన్‌ హాఫిన్‌ తెలిపారు.

- Advertisement -

చైనాలో కఠినమైన కొవిడ్‌ నిబంధనలు, ప్రయాణాలపై ఆంక్షల మూలంగా అమెరికాకు వెళ్లే చైనా విద్యార్ధులు సంఖ్య ఈ సారి తగ్గే అవకాశం ఉందని డాన్‌ హాఫిన్‌ చెప్పారు. ఈ సారి చైనా విద్యార్ధులకు 1,10,000 నుంచి 1,20,000 వీసాల వరకు జారీ కావచ్చన్నారు. ఇది గతం కంటే 50వేలు తక్కువ. 2021-22 సంవత్సరంలో భారత్‌, చైనా విద్యార్ధులు కలిసి మొత్తం అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్ధుల్లో 50 శాతం ఉన్నారు.

క్రితం సారి వీసాల జారీలో చైనా విద్యార్ధుల సంఖ్య 9 శాతం తగ్గింది. 2020-21 సంవత్సరంలో చైనా నంఉఇచ 3,17,299 మంది విద్యార్ధులు అమెరికా వెళ్లగా, 2021-22 సంవత్సరంలో 2,90,086 మంది విద్యార్ధులు అమెరికా వీసాలు పొం దారు. పది సంవత్సరాల క్రితమే చైనా నుంచి 2,35,597 మంది విద్యార్ధులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. 2019-20 లో 4.4 శాతం, 2020-21లో 13.2 శాతం మేర అమెరికా యూనివర్శిటీల్లో మన విద్యార్ధుల సంఖ్య తగ్గింది. కోవిడ్‌ ప్రభావంతోనే విద్యార్ధుల సంఖ్య తగ్గింది.

మన దేశం నుంచి అమెరికా వెళుతున్న విద్యార్ధులు ఎక్కువగా మాథమెటిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతున్నారు. అమెరికాలో అన్ని దేశాల విద్యార్ధులు కలిపి 2020-21లో 9.14 లక్షల మంది, 2021-22లో 9.48 లక్షల మంది చదువుతున్నారు. అమెరికాలో ఉన్నత విద్య ప్రాముఖ్యాన్ని ఇండియన్‌ విద్యార్ధుల, వారి తల్లిదండ్రులు గుర్తించినందునే ఏటా వీరి సంఖ్య పెరుగుతుందని డాన్‌ హాఫీన్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement