Saturday, November 23, 2024

స్వర్ణంతో మెరిసిన భారత షూటర్లు.. ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌

బాకు (ఆజర్‌బైజాన్‌): ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు స్వర్ణంతో మెరిసారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు ఈషా సింగ్‌, శివ నర్వాల్‌ జోడీ టర్కీ జోడీని ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దాంతోపాటు ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో పతకాన్ని అందించారు. ఇంతకుముందు గురువారం జరిగిన పోటీల్లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ పురుషుల ఈవెంట్‌లో భారత్‌కు కాంస్య పతకం లభించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం భారత్‌ రెండు పతకాలతో రెండో స్థానంలో నిలవగా.. చైనా (5 స్వర్ణాలు, 2 కాంస్యాలు) 7 పతకాలతో మొదటి స్థానంలో ఉంది. మరోవైపు ఒక్క బంగారు పతకం సాధించిన అమెరికా (1 స్వర్ణం)తో మూడవ స్థానాన్ని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన 10మీ ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌ ఫైనల్లో భారత షూటర్లు ఈషా సింగ్‌, శివ నర్వాల్‌ (16-10) తేడాతో టర్కీ ద్వయం ఇలయిదా తర్హాన్‌, యూసుఫ్‌ డికెక్‌పై విజయం సాధించారు.

ఈషా సింగ్‌ (290), నర్వాల్‌ (293) పాయింట్లు సాధించడంతో భారత్‌ మొత్తంగా 583 పాయింట్లతో తొలి స్థానాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు తుర్కీ జట్టు 581 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. 580 పాయింట్లతో చైనా కాంస్య పతకాన్ని అందుకుంది. మహిళల స్కీట్‌ జట్టు పతకం గెలవడంలో విఫలమై నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ పోటీలో మెహులి గోష్‌, ఐశ్వర్య ప్రతాప్‌ సింగ్‌ థోమర్‌ 9వ స్థానంలో నిలిచింది. మరో భారత జోడీ రమిత, దివ్యాన్ష్‌ సింగ్‌ పన్వార్‌ 17వ స్థానంలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement