ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందు రెండు వారాల క్వారంటైన్. ఇంగ్లండ్‌లో దిగిన తర్వాత మళ్లీ పది రోజుల క్వారంటైన్. అందరూ కలిసి ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా లేదు. అందులోనూ నాలుగున్నర నెలల సుదీర్ఘ పర్యటన. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాకు ఊరట కలిగించే వార్తే ఇది. న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత కోహ్లి సేనకు బయో బబుల్ నుంచి 20 రోజుల బ్రేక్ లభించనుంది. జూన్ 24న బబుల్ నుంచి బయటకు వెళ్లిపోతే మళ్లీ జూలై 14న బయోబబుల్‌లోకి రావాల్సి ఉంటుందని టీమ్ మేనేజ్‌మెంట్ వర్గాలు వెల్లడించాయి.
ఈ వార్త తమకు ఎంతో ఊరట కలిగించే విషయమని టీమిండియా వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఇంగ్లండ్‌తో రెండు నెలల పాటు జరిగే టెస్ట్ సిరీస్ ముగియగానే ఆటగాళ్లంతా మళ్లీ ఐపీఎల్ బబుల్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ 20 రోజులు వాళ్లకు స్వేచ్ఛగా తిరిగే అవకాశం రావడం మానసికంగా ఉల్లాసానికి గురి చేసేదే. ఆగస్ట్ 4న ఇంగ్లండ్‌తో టీమిండియా తొలి టెస్ట్ ఆడాల్సి ఉంది. అంటే ఫైనల్ ముగిసిన తర్వాత సుమారు 40 రోజుల సమయం ఉంది. అందులో 20 రోజులు ప్లేయర్స్‌ను స్వేచ్ఛగా వదిలేయనుండగా.. జులై 14 నుంచి మళ్లీ బబుల్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ గ్యాప్‌లో ప్లేయర్స్ యూకేలో ఎక్కడికైనా వెళ్లి రావచ్చు. అయితే కరోనా ఇంకా పూర్తిగా పోలేదని, అందువల్ల అందుకు తగినట్లు ప్లేయర్స్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని టీమ్ మేనేజ్‌మెంట్ చెప్పింది.