ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్ టోర్నీలో ఇవ్వాల (శనివారం) జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత స్టార్ ద్వయం సాత్విక్ – చిరాగ్ లు విజయం సాధించారు. సెమీఫైనల్ పోరులో మలేషియన్ జోడీ అయిన సో వూయ్ యిక్ – ఆరోన్ చియా టెంగ్ ఫాంగ్ లపై వరుస సెట్లలో 21-18, 21-14 పాయింట్లతో గెలుపొందారు. ఇక రేపు (ఆదివారం) జరగనున్న ఫైనల్స్ లో దక్షిణ కొరియా జోడీ సీయో సీయుంగ్ జే – కాంగ్ మిన్-హ్యూక్ లతో తలపడనున్నారు.
అంతకముందు జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ పోరులో భారత్ కు నిరాశే మిగిలింది. భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ చైనీస్ ప్లేయర్ షి యుకీ చేతిలో 15-21, 5-21 పాయింట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. కాగా, రేపు జరగనున్న మెన్స్ సింగిల్స్ ఫైనల్స్ లో హాంకాంగ్‌కు చెందిన లీ చెయుక్ తో చైనీస్ ప్లేయర్ షి యుకీ తలపడనున్నాడు.