దేశ ప్రజలకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరికలు జారీ చేసింది. కరోనా థర్డ్ వేవ్ తప్పదని, అది కూడా త్వరలోనే రాబోతోందని ఐఎంఏ చెప్పింది. ఇలాంటి సమయంలో అధికారులు, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ప్రపంచంలో ఏం జరిగిందో మనకు తెలుసు. గతంలో మహమ్మారులను చూసినా తెలుస్తుంది. థర్డ్ వేవ్ తప్పదు. అయినా దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వాలు, ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా వేడుకలు చేసుకుంటున్నారు’ అని ఐఎంఏ ఒక ప్రకటనలో చెప్పింది.
‘టూరిజం, తీర్థయాత్రలు, మత సంబంధమైన వ్యవహారాలు అవసరమే కానీ.. వాటిని మరికొన్ని నెలలు ఆపవచ్చు. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఇలాంటి వాటికి ప్రజలను అనుమతిస్తే వీళ్లే సూపర్ స్ప్రెడర్లుగా మారి కరోనా థర్డ్ వేవ్‌కు కారణమవుతారు’ అని ఆ ప్రకటనలో ఐఎంఏ హెచ్చరించింది. కరోనా నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్ ద్వారా థర్డ్ వేవ్ ప్రభావాన్ని తగ్గించవచ్చని కూడా చెప్పింది. వచ్చే రెండు, మూడు నెలలపాటు ఎలాంటి అలసత్వం లేకుండా వ్యవహరించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: ఏపీలో మరోసారి కర్ఫ్యూ వేళల్లో మార్పులు