ప్రేమకు హద్దులు లేవని పెద్దలు అంటుంటారు. దీంతో ఇద్దరు ప్రేమికుల ప్రేమ సరిహద్దులు దాటిపోయింది. అలా ఓ ఇద్దరు ప్రేమించుకుని.. పెళ్లి చేసుకుని చివరకు పోలీసులకు దొరికిపోయారు. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని బల్లావ్‌పూర్ గ్రామానికి చెందిన జైకాంతో చంద్రరాయ్ (24)కు ఫేస్‌బుక్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన అమ్మాయి పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని చంద్రరాయ్ నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ ఏడాది మార్చి 8న ఓ బ్రోకర్ సహాయంతో సరిహద్దు దాటి బంగ్లాదేశ్ చేరుకున్నాడు. మార్చి 10న తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడే ఇద్దరూ జూన్ 25వ తేదీ వరకు కలిసి ఉన్నారు. జూన్ 26న చంద్ర రాయ్ తన సొంతూరికి సరిహద్దు గుండా బయల్దేరాడు. సరిహద్దును దాటించేందుకు చంద్రరాయ్ బంగ్లాదేశ్ స్థానికులకు రూ. 10 వేలు ఇచ్చాడు.
మొత్తంగా జూన్ 26న సరిహద్దు గుండా ఓ జంట వస్తున్నట్లు బీఎస్ఎఫ్ బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన బీఎస్ఎఫ్.. శనివారం సాయంత్రం ఆ జంటను బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. బలగాల విచారణలో వారిది ప్రేమ వివాహం అని తేలింది. అబ్బాయిది బెంగాల్, అమ్మాయిది బంగ్లాదేశ్ అని తేలడంతో.. సరిహద్దు దాటేందుకు వారికి సహకరించిన వారిపై పోలీసులు నిఘా పెట్టారు. అరెస్టు అయిన నవ దంపతులు పోలీసుల కస్టడీలో ఉన్నారు.