భారత జూనియర్ హాకీ వరల్డ్ కప్ హీరో రాజీవ్ మిశ్రా కన్నుమూశాడు. వారణాసిలోని తన సొంత ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతను నివసిస్తున్న ఇంటిలోంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో, పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. ‘రాజీవ్ అకాల మరణం భారత హాకీకి తీరని లోటు. అతనొక అద్భుతమైన నైపుణ్యం ఉన్న ప్రతిభావంతుడు’ అని రాజీవ్ చిన్ననాటి కోచ్ ప్రేమ్ శంకర్ శుక్లా అన్నాడు. రాజీవ్ మృతి పట్ల హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టర్కీ సంతాపం తెలియజేశాడు. 46 ఏళ్ల రాజీవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రాజీవ్ లండన్‌లో జరిగిన 1997 వరల్డ్ కప్ లో సత్తా చాటాడు. అయితే.. ఫైనల్లో భారత జట్టు 2-3తో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో జర్మనీపై కొట్టిన డైవింగ్ గోల్‌ను ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోలేరు. అతను 9 గోల్స్ కొట్టాడు. రాజీవ్‌కు ఉత్తర రైల్వే లక్నో డివిజన్‌లోని వారనణాసి చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ టికెట్‌గా ఉద్యోగం వచ్చింది. దాంతో, అప్పటి నుంచి అతను అక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. రాజీవ్ సొంతూరు బిహార్‌లోని హజీపూర్. రాజీవ్ ప్రతిభను గుర్తించిన కోచ్ శంకర్ 13 ఏళ్ల వయసులో అతడిని వారణాసికి తీసుకొచ్చాడు. అక్కడ స్పోర్ట్స్ అథారిటీలో చేర్పించాడు. అక్కడ రాజీవ్ ఆటలో మరింత మెరుగుపడ్డాడు. జూనియర్ వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించాడు.