Saturday, November 23, 2024

గ్లోబల్‌ డీల్స్‌తో సత్తాచాటిన ఇండియన్‌ కంపెనీలు.. రెండో త్రైమాసికలో 82 బిలియన్‌ డాలర్ల ఒప్పందాలు

న్యూఢిల్లి : ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఆర్థిక వృద్ధిరేటు మందగిస్తోది. మరో వైపు ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతుంది. అన్ని దేశాల కరెన్సీ విలువ తగ్గిపోతున్నది. ఈ పరిస్థితుల్లోనూ భారత్‌ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల కొనుగోళ్లు, విలీనాలతో సత్తా చాటాయి. రెండో త్రైమాసికంలో రికార్డ్‌ స్థాయిలో 82.3 బిలియన్‌ డాలర్ల డీల్స్‌ జరిగాయి. 2019లో రికార్ట్‌ స్థాయిలో జరిగిన 38.1 బిలియన్‌ డాలర్ల ఒప్పందాల కంటే ఇది ఎంతో ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఈ త్రైమాసికంలో 827.6 బిలియన్‌ డాలర్ల కొనుగోళ్లు, విలీన ఒప్పందాలు జరిగాయి. ఇది అంతకు ముందు సంవత్సరం 2021 ఇదే త్రైమాసికంతో పోల్చితే 8.7 శాతం తక్కువ. మన దేశంలో రికార్డ్‌ స్థాయిలో జరిగిన ఎం అండ్‌ ఏ డీల్స్‌లో సింహా భాగం హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్‌ జరిపిన లావాదేవీలే కారణం. హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్‌ 60 బిలియన్‌ డాలర్లతో హౌస్సింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ను కొనుగోలు చేసింది. ఇదే మన దేశంలో ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద కొనుగోలు ఒప్పందం. ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్‌ కంపెనీలు, సంస్థలు ఎలా తమను తాము పురోగమనం వైపు పయనించేలా మలుచుకుంటున్నాయో ఈ ఒప్పందం తేటతెల్లం చేసిందని ఆర్థిక రంగ నిపుణులు స్పష్టం చేశారు. సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఎలా పురోగమిస్తున్నాయో తెలుస్తుందని, ఇది అన్ని రంగాల్లోనూ కనిపిస్తోందని గోల్డ్‌మెన్‌ సాచే గ్రప్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ ఛటర్జీ అభిప్రాయపడ్డారు. మైండ్‌ ట్రీ, లార్సన్‌ అండ్‌ ట్యూబ్రో ఇన్ఫోటెక్‌ కంపెనీల విలీనం మరో ముఖ్యమైనది. పరిస్థితులు, మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, మార్కెట్‌లో బలమైన ముద్ర వేయడం, బిజినెస్‌ అవకాశాలు విస్తృతపరుచుకునేందుకు కంపెనీలు సమయానుకూలంగా ఎలా వ్యవహరిస్తాయన్న దానికి ఈ రెండు కంపెనీల విలీనమే నిదర్శమని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఈ రెండు కంపెనీలు ఇంజనీరింగ్‌ సంస్థగా ఉన్న ఎల్‌ అండ్‌ టీ కి అనుబంధ సంస్థలే. 3.3 బిలియన్‌ డాలర్లకు మొత్తం మైండ్‌ ట్రీ షేర్లను ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ కొనుగోలు చేసింది.

హెచ్‌డిఎఫ్‌సీ మోగా డీల్‌ను లేకుండా కూడా ఈ త్రైమాసికంలో జరిగిన కొనుగోళ్లు, విలీనాల విషయంలో ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది. మరో బిగ్‌ డీల్‌ గౌతం అదాని కంపెనీ చేసింది. అంబుజా సిమెంట్‌ కంపెనీని గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 10.5 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల వల్లే ఇలాంటి భారీ ఒప్పందాలు జరుగుతున్నాయని మరో ప్రముఖ విశ్లేషకుడు గణషన్‌ మురియగన్‌ అభిప్రాయపడ్డారు. కంపెనీలు మన దేశంలో పునరత్పాదక ఇంధన రంగం పైపు దృష్టి సారించాయి. ఈ రంగంలో ఈ త్రైమాసికంలో అతి పెద్ద కొనుగోలు జరిగింది. షెల్‌ పిఎల్‌సి కంపెనీ 1.5 బిలియన్‌ డాలర్లతో ప్ప్రింగ్‌ ఎనర్జీని కొనుగోలు చేసింది. ప్రెంచ్‌ ఆయిల్‌ కంపెనీ అయిన టోటల్‌ ఇంజినేరింగ్‌ ఎస్‌ఇ కంపెనీ అదానీ న్యూ ఇండస్ట్రీస్‌ లో 25 శాతం వాటాను జూన్‌లో కొనుగోలు చేసింది. ఈ కంపెనీ గ్రీన్‌ హైడ్రోజన్‌ రంగంలో 50 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. కార్పోరేట్‌ రుణాలు దాదాపు ఆగిపోయిన సమయంలో అతి పెద్ద ఒప్పందాలు జరగడం అంత తేలికకాదని, మురుగయన్‌ అభిప్రాయపడ్డారు. మరికొన్ని ఒప్పందాలు మిడ్‌ సైజ్‌ కంపెనీల నుంచి వస్తున్నాయని ఆయన తెలిపారు. కంపెనీలు క్రమంగా వచ్చే తరాలకు అవసరమైన ఆలోచన, ముఖ్యంగా టెక్నాలజీపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ కంపెనీలు మరింత బలోపేతం అయ్యేందుకు భారీ ఒప్పందాలు మరికొన్ని జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement