భారత బ్యాడ్మింటన్ దిగ్గజాలు పీవీ సింధు, బి. సాయి ప్రణీత్, పారుపల్లి కశ్యప్ మలేసియా మాస్టర్స్‌లో అద్భుత ప్రదర్శనతో రెండో రౌండ్‌కు అర్హత సాధించారు. సైనా నెహ్వాల్ మాత్రం తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. మలేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా బుధవారంనాడిక్కడ జరిగిన మహిళల సింగిల్స్ విభాగం తొలి రౌండ్లో మాజీ వరల్డ్ చాంపియన్ పీవీ సింధు ఘనవిజయం సాధించింది. చైనాకు చెందిన హి బింగ్ జియావోపై 21-13, 17-21, 21-15 తేడాతో విజయం సాధించింది. 57 నిముషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సింధు, ఆ తర్వాత గేమ్‌లో ప్రత్యర్థి ఎదురుదాడికి తట్టుకోలేకపోయింది. అయితే ఆఖరి గేమ్‌లో తిరిగి పట్టు సాధించిన పీవీ సింధు సునాయాసంగా గెలిచింది. రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. ఇకపోతే, లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత సైనా నెహ్వాల్ 21-16, 17-21, 14-21 తేడాతో కొరియా క్రీడాకారిణి కిమ్ గయున్ చేతిలో ఓటమి పాలైంది.
ఇక మరోవైపు సాయి ప్రణీత్ తన ప్రత్యర్థి మాజీ పాన్ అమెరికన్ గేమ్స్ చాంపియన్ కెవిన్ కార్డెన్పై 21-8, 21-9 తేడాతో వరుస సెట్లలో గెలిచాడు. 26నిముషాల పాటు సాగిన ఈ పోరులో సాయిప్రణీత్ ధాటికి ప్రత్యర్థి కెవిన్ కార్డెన్ చేతులెత్తేశాడు. పారుపల్లి కశ్యప్, తన ప్రత్యర్థి మలేసియా క్రీడాకారుడు టామీ సుగియార్టోపై 16-21, 21-16, 21-16తేడాతో విజయం సాధించాడు. మరో షట్లర్ సమీర్ వర్మ తైవాన్‌కు చెందిన చో టైన్ చెన్ చేతిలో 10-21, 21-12, 21-14 తేడాతో ఓడిపోయాడు.
మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయిత్రి- ట్రెసా జాలీ జోడీ 14-21, 14-21తో మలేసియా జోడీ పియర్లీ టాన్- తినా చేతిలో ఓడిపోయింది. అశ్విని శిఖా, దండు పూజ- ఆరతి జోడీలు కూడా తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మాళవిక 10-21, 17-21తో మలేసియా క్రీడాకారిణి గో జిన్ వె చేతిలో ఓటమి పాలైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.