ఈ ఏడాది భారత ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి అసాధారణ ప్రదర్శన చేస్తోంది. సూపర్ ఫామ్ లో ఉన్న ఈ జంట వరుసగా మూడో టైటిల్ ను నెగ్గింది. ఇవ్వాల ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట.. పురుషుల డబుల్స్ లో నం.1 స్థానంలో ఉన్న ఇండోనేషియా జోడీ పై 17-21, 21-13, 21-14తో కొరియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దాదాపు 60 నిమిషాల పాటు సాగిన ఫైనల్ పోరులో ఇరు జోడీలు హోరా హోరీగా తలపడ్డాయి. తొలి సెట్‌ను కోల్పోయిన భారత జోడీ., రెండె సెట్ నుండి అద్భుతమైన మెరుగుదల కనబరిచింది. దీంతో ఇండోనేషియా జోడీ అయిన ఫజర్ అల్ఫియాన్, ముహమ్మద్ రియాన్ ఆర్డియాంటోలపై అద్భుత విజయం సాధించింది.
ప్రపంచ రెండో ర్యాంకర్ చైనా జోడీ లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్‌లపై శనివారం జరిగిన వరుస గేమ్‌ల విజయంతో భారత ద్వయం ఫైనల్‌లోకి ప్రవేశించింది. జిన్నామ్ స్టేడియంలో జరిగిన 40 నిమిషాల పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్ భారత జోడీ 21-15, 24-22తో రెండో సీడ్ చైనీస్‌పై విజయం సాధించింది.
ఇక ఈ ఏడాది ఇండోనేసియా 1000 సూపర్ సిరీస్ టోర్నీతో పాటు స్విస్ ఓపెన్ 500 టైటిల్‌ను కూడా సాత్విక్ ద్వయం ఖాతాలో వేసుకోగా.. ఈ విజయంతో సాత్విక్-చిరాగ్ జోడీ ఈ ఏడాది వరుసగా మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక కొరియా ఓపెన్ టైటిల్ గెలవడం సాత్విక్-చిరాగ్ జోడీకి ఇదే తొలిసారి.